సాక్షి, బళ్లారి: రాష్ట్ర ప్రణాళిక, గణాంక మంత్రి డి.సుధాకర్‌కు కుటుంబీకులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఆదివారం తెల్లవారుజామున మరణించడం తెలిసిందే. భౌతికకాయాన్ని చిత్రదుర్గం జిల్లా హిరియూరుకు తీసుకొచ్చి ప్రజల సందర్శనార్థం ఉంచారు. తరువాత చెళ్లకెరెకు తీసుకువచ్చి స్టేడియంలో కొంత సేపు ఉంచి, నివాసానికి తరలించారు. తమ నేతను కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. అక్కడి నుంచి పార్థివ దేహాన్ని ప్రత్యేక వాహనంలో ఊరేగింపుగా తీసుకెళ్లి పావగడ రోడ్డులోని ఆర్యవైశ్య ముక్తిధామలో జైన సంప్రదాయం ప్రకారం, ప్రభుత్వ లాంఛనాలతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. కుమారుడు సుహాస్ చేతుల మీదుగా అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, స్పీకర్ ఖాదర్, పలువురు కాంగ్రెస్ ప్రముఖులు, మంత్రులు పాల్గొని తుది నివాళులు అర్పించారు. పార్థివ దేహంపై కప్పిన జాతీయ జెండాను సీఎం, డీసీఎంలు ఆయన సతీమణి హర్షిణి కి అందజేశారు. సుధాకర్‌ను డీకే శివకుమార్ గుర్తు చేసుకొని ఆవేదనకు గురయ్యారు. ఆయనను బతికించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేశామని చెప్పారు.
మంత్రి డి.సుధాకర్ (ఫైల్)
చెళ్లకెరెలో ప్రభుత్వ లాంఛనాలతో
అంత్యక్రియలు
హాజరైన సీఎం, డీసీఎం, మంత్రులు


