రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో విద్యా శాఖలో మార్పులు తెస్తామని డీడీపీఐ మల్లికార్జున పేర్కొన్నారు. సోమవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు. బడిగేర్‌ను గదగ్‌కు బదిలీ చేయడంతో రాయచూరు డయట్ సీనియర్ అధ్యాపకుడిగా, దేవదుర్గ తాలూకా విద్యా శాఖాధికారి(బీఈఓ)గా పని చేస్తున్న తనకు జిల్లా స్థాయి బాధ్యతలు అప్పగించారన్నారు. పదో తరగతి ఫలితాల్లో జిల్లాను ఈ ఏడాది 15వ స్థానంలో నిలపడానికి ప్రయత్నిస్తామన్నారు. ఉపాధ్యాయులు, సంఘం కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు, సిబ్బంది సహకారంతో విధులు నిర్వహిస్తామన్నారు.
చెరువు స్నానం.. తీసింది ప్రాణం
●స్నానానికి వెళ్లి యువకుడు మృత్యువాత
హొసపేటె: కొప్పళ జిల్లా కుష్టిగి తాలూకాలోని వనగేరి వద్ద చెరువులో స్నానానికి వెళ్లిన ఓ యువకుడు మృత్యువాత పడిన ఘటన జరిగింది. ఆ తాలూకాలోని బోదూరు గ్రామానికి చెందిన హనుమంత(17) అనే యువకుడు తోటి యువకులతో కలిసి స్నానానికి వెళ్లాడు. అయితే నీటిలోకి దూకిన హనుమంత తిరిగి పైకి రాలేదు. ఈ విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు తెలియజేశారు. ఘటన స్థలానికి చేరుకున్న గ్రామస్తులు, అగ్నిమాపక సిబ్బంది గాలించి, మృతదేహాన్ని వెలికి తీశారు.
విద్యార్థిని మృతిపై విచారణకు వినతి
రాయచూరు రూరల్: జిల్లాలోని సింధనూరులో ఇటీవల ప్రైవేట్ కళాశాల నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో జీపును వెనుకకు మళ్లిస్తుండగా అదుపు తప్పి ఢీకొనడంతో భూమిక(17) అనే విద్యార్థిని దుర్మరణం చెందడంపై విచారణ జరపాలని సీపీఐ(ఎంఎల్) డిమాండ్ చేసింది. సోమవారం సింధనూరులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు పూజార్ మాట్లాడారు. విద్యార్థిని కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం అందించాలని ఒత్తిడి చేస్తూ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
ప్రియుడితో పెళ్లికి నిరాకరణ.. యువతి ఆత్మహత్య
హుబ్లీ: ప్రియుడితో పెళ్లికి నిరాకరించిన కుటుంబ సభ్యుల తీరుతో మనోవేదనకు గురై ఓ యువతి విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ధార్వాడ జిల్లాలోని కుందగోళ తాలూకా యరగుప్పి గ్రామంలో జరిగింది. శ్వేత(18) ఆత్మహత్య చేసుకున్న యువతి. మృతురాలు శ్వేత కొన్నేళ నుంచి హుబ్లీ తాలూకా కిరేసూర గ్రామానికి చెందిన నాగరాజ్‌ను ప్రేమిస్తుండేది. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలిపి నాగరాజ్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీనికి కుటుంబ సభ్యులు ఒప్పుకోక పోవడంతో జీవితం విరక్తి చెందిన ఆమె విషం తాగింది. ఘటనపై కుందగోళ పోలీసులు కేసు నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బాలికలకు టీకా అభియాన్
బళ్లారిటౌన్: జిల్లాలో 14 ఏళ్ల వయస్సులోపు బాలికలకు క్యాన్సర్ నియంత్రణ కోసం టీకా అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు డీహెచ్‌ఓ యల్లా రమేష్ బాబు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ అభియాన్‌ను ప్రవేశ పెట్టామని, దీన్ని సద్వినియోగ పరుచుకోవాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు. జిల్లాలో 16,495 మంది బాలికలకు ఈ టీకాలను వేసే లక్ష్యం ఉందన్నారు. ఇంత వరకు 5,658 మంది బాలికలకు టీకాలను వేసినట్లు తెలిపారు. దీనిపై ఎలాంటి దుష్ప్రచారాన్ని నమ్మరాదని కోరారు.


