హొసపేటె: తాళాలు వేసి ఉన్న ఇళ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సోమవారం విజయనగర జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా పోలీస్ కేంద్రం సభాంగణంలో ఎస్పీ జాహ్నవి విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. కొన్ని నెలలుగా హగరిబొమ్మనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రిపూట తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలు కుమారనహళ్లి, జహంగీర్ బాషాలను అరెస్ట్ చేశామన్నారు. పలు ఇళ్లలో చోరీలకు పాల్పడి బంగారు, వెండి ఆభరణాలు దోచుకెళ్లారన్నారు. దొంగలించిన సొత్తును అమ్ముకుని వచ్చిన డబ్బులను పంచుకుని జల్సాలు చేసేవారన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దొంగలను పట్టుకున్నారన్నారు. నిందితులు హగరిబొమ్మనహళ్లి, తంబ్రళ్లి, మరియమ్మనహళ్లి ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.12.56 లక్షల విలువైన 96.54 గ్రాముల బంగారు, రూ.1.50 లక్షల విలువైన 750 గ్రాముల వెండి ఆభరణాలను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దొంగలను పట్టుకున్న కూడ్లిగి డీఎస్పీ మల్లేష్ దొడ్డమని, హగరిబొమ్మనహళ్లి ఎస్‌ఐ వికాస్ పి.లమాణి, మరియమ్మనహళ్లి ఎస్‌ఐ తారాబాయి, తంబ్రళ్లి ఎస్‌ఐ నాగరాజ్, సిబ్బందిని ఎస్పీ జాహ్నవి అభినందించి రివార్డులు అందజేశారు.
రూ.14 లక్షల ఆభరణాలు స్వాధీనం


