హుబ్లీ: బెళగావి తాలూకా వనగ గ్రామంలోని పారిశ్రామికవాడలో ఆదివారం అర్ధరాత్రి దాటాక ఘోర అగ్నిప్రమాదం వాటిల్లింది. ఇక్కడి డాంగే ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఆకస్మికంగా మంటలు చెలరేగగా ఘటనలో రూ.లక్షలాది విలువ చేసే ప్లాస్టిక్ వస్తువులు, యంత్ర పరికరాలు దగ్ధమయ్యాయి. అర్ధరాత్రి ఉన్నఫళంగా మంటలు చెలరేగగా, ప్లాస్టిక్ వస్తువులు భారీగా ఉండటంతో కొద్ది సేపటిలోనే ఫ్యాక్టరీ అంతా మంటలు వ్యాపించాయి. ఘటన సమాచారం అందుకున్న వెంటనే స్థలానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది ఎంతో శ్రమించి మంటలను అర్పారు. సమయ స్పూర్తితో నడుచుకున్నందు వల్ల అగ్నిజ్వాలలు పక్కన ఉన్న ఫ్యాక్టరీలకు తగలక పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రాథమిక అంచనా ప్రకారం షార్ట్‌సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఫ్యాక్టరీలోని విలువైన ప్లాస్టిక్ ముడివస్తువులు, అలాగే తయారు చేసిన ప్లాస్టిక్ ఉత్పత్తులు అగ్నికి ఆహుతయ్యాయి. అదృష్టం కొద్ది ఘటనలో ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. కాకతి పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం జరగడంతో ఘటన స్థలాన్ని సంబంధిత పోలీసులు పరిశీలించి నివేదిక సిద్ధ చేస్తున్నట్లు తెలిసింది.


