హొసపేటె: తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఆదివారం హొసపేటెలోని డాక్టర్ పునీత్ రాజ్‌కుమార్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్డ్ కులాల విభాగం నాయకులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ప్రజలు, పార్టీ అభిమానులకు స్వీట్లు పంచిపెట్టారు. దేశంలో ప్రజాస్వామ్యం, సంకీర్ణ రాజకీయాల విజయానికి మద్దతుగా కార్యకర్తలు నినాదాలు చేశారు. విజయనగర జిల్లా షెడ్యూల్డ్ కులాల విభాగం జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ బంతమనే మాట్లాడుతూ.. మనువాద భావజాలం కలిగిన బీజేపీ పార్టీ ఏ కారణం చేతనైనా సరే దక్షిణ భారతదేశంలో ఎప్పటికీ అధికారంలోకి రాలేదని తెలిపారు. తమిళనాడులో అమలువుతున్న పాలన, సంకీర్ణ ప్రభుత్వ విజయం యావత్ దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ షెడ్యూల్డ్ కులాల విభాగం ప్రముఖ కార్యనిర్వాహకులు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, తలూరు వీరభద్ర, సజ్జద్‌ఖాన్, రఘు, నాగరాజు, గిరీష్, ప్రకాష్, బి.మౌలాలి, శశికుమార్, కిషోర్ కుమార్, కార్తీక్, గణేష్, యోహాన్, అమీద్ హుస్సేన్, బాబా ఫకృద్దీన్, ఆశాబేగం తదితరులు పాల్గొన్నారు.
డ్రగ్ పెడ్లర్ అరెస్ట్
హుబ్లీ: మత్తు పదార్థాల సేకరణ, విక్రయం కేసులో దాండేలి సుభాష్ నగర్ నివాసి అయాన్ సాన్వాజ్‌ను అరెస్ట్ చేసి బళ్లారి జైలుకు పంపారు. మత్తు పదార్థాల సేకరణ నిల్వ, రవాణా విక్రయాల్లో వృత్తి పరమైన డ్రగ్స్ పెడ్లర్ అయిన నిందితుడిపై దాండేలి పోలీసులు 5 కేసులు, హుబ్లీ గోకుల్ రోడ్డు పోలీసులు కేసు నమోదు చేశారు. పలుసార్లు జైలుకు పంపిన కూడా బెయిల్ షరతులను ఉల్లంఘించాడు. పదే పదే ఇవే నేరాలకు పాల్పడటంతో ఐజీపీ, ఎస్పీ ఆదేశాల మేరకు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణ చట్టం ద్వారా డ్రగ్స్ పెడ్లర్ అయాన్ సాన్వాజ్‌ను అరెస్ట్ చేసి జైలు పంపించడం జరిగిందని పోలీసులు తెలిపారు.
ప్రాణం తీసిన ఈత సరదా
రాయచూరు రూరల్: ఈత సరదా ప్రాణం తీసింది. మిత్రులతో కలసి ఈత కోసం వెళ్లి యువకుడు దుర్మరణం పాలైన ఘటన ఆదివారం బీదర్ జిల్లాలో చోటు చేసుకుంది. బీదర్ జిల్లా కమల నగర తాలూకా బళత వద్ద ఉన్న మంజ్రా నదిలోకి అనిల్ చిద్రి (28) స్నేహితులతో కలసి ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత కొడుతూ లోతైనా ప్రదేశానికి వెళ్లిన అనిల్ చిద్రి నీట మునిగిపోయాడు. తోటి స్నేహితులు వెంటనే కుటుంబ సభ్యులు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్ని మాపక సిబ్బంది, రెవెన్యూ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బోట్ ద్వారా మంజ్రా నదిలో గాలించారు. చాలా సేపు అనంతరం యువకుడి మృతదేహం లభ్యం కావడంతో వెలికితీశారు. కుశనూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కేఎంసీ ఆస్పత్రిలో
మహిళకు ప్రాణదానం
హుబ్లీ: రక్తహీనత, తలసీమియా, హెమోగ్లోబిన్ కొరత తదితర అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న మహిళకు కేఎంసీ ఆస్పత్రి వైద్యులు పునర్ జన్మ ప్రసాదించారు. నెల రోజుల క్రితం విజయవంతంగా ఆపరేషన్ చేసి ఆమె ప్రాణాలు కాపాడారు. వివరాలు.. విజయనగర జిల్లా కంప్లి సమీపంలో ఓ గ్రామానికి చెందిన రేణుక (47) తొలి కాన్పులో మగ్గ బిడ్డకు జన్మినిచ్చింది. ఆ తర్వాత మూడు అబార్షన్లు జరిగాయి. 5వ సారి మళ్లీ రేణుక గర్భం దాల్చింది. అనారోగ్యానికి గురికావడం, నిసత్తువతో ఎప్పుడు నిద్రించేది. గంగావతి, కూష్టగి ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందింది. ఆ తర్వాత బెంగళూరులోని ఓ ఆస్పత్రికి వెళ్లి తిరిగి కొప్పళ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. తల్లీబిడ్డ బతకడం కష్టమని సదరు ఆస్పత్రుల్లోని వైద్యులందరూ తేల్చి చెప్పారు. అంతేగాక ఆస్పత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించారు. కొప్పళ వైద్యుల సూచన మేరకు కేఎంసీ ఆస్పత్రికి వచ్చిన రేణుక.. ఏప్రిల్ నెలలో అడ్మిట్ అయ్యింది. కిమ్స్ వైద్యులు ఆమెకు తొలుత వివిధ వైద్య పరీక్షలు చేశారు. రక్తహీనతతో పాటు కొన్ని సమస్యలు ఉండటంతో కడుపులో ఉన్న బిడ్డ చనిపోయినట్లుగా గుర్తించారు. తక్షణమే మాతృ శిశు ఆస్పత్రి విభాగంలో డాక్టర్ రామలింగప్ప అంతర్‌సాని నేతృత్వంలోని వైద్య బృందం సహజ ప్రసవం చేశారు. ప్రస్తుతం రేణుక ఆరోగ్యం కుదుటపడింది.


