రాయచూరు రూరల్: సర్కారు కార్యాలయాలను ప్రజలకు సేవలు చేసే దేవాలయాలుగా భావిస్తాం. అయితే కొంతమంది అధికారులు వాటిని అసాంఘిక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. రాయచూరు జిల్లా లింగసూగురులో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం కార్యాలయం మందు పార్టీలకు వేదికగా మారింది. రాత్రి వేళ్లలో అధికారులు పార్టీలు చేసుకుంటూ క్లబ్‌గా మార్చేస్తున్నారు. శనివారం రాత్రి కార్యాలయంలో అధికారులు రెచ్చిపోయారు. విచ్చల విడిగా మందు తాగుతూ జల్సాలు చేశారు. పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ఏఈఈ హనుమప్ప అదవాని ఇతర అధికారులతో కలసి పాటలు పాడుతూ డ్యాన్స్ చేశారు. ప్రభుత్వ కార్యాలయంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఉన్నత స్థాయి అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారు. జల్సాలు చేస్తున్న అధికారులపై వేటు వేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. కనీసం ఇప్పటికై నా స్పందించి చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి మరి.


