మృత్యువుతో పోరాడి.. ఓడిన మంత్రి సుధాకర్‌ | - | Sakshi
Sakshi News home page

మృత్యువుతో పోరాడి.. ఓడిన మంత్రి సుధాకర్‌

May 11 2026 8:26 AM | Updated on May 11 2026 8:26 AM

శివాజీనగర: రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర విషాదం సంభవించింది. ప్రణాళికా, గణాంక మంత్రి, చిత్రదుర్గ ఇన్‌చార్జి.. డి.సుధాకర్‌ (62) ఆదివారం తెల్లవారుజామున మరణించారు. సుమారు నెల రోజుల నుంచి ఆయన శ్వాసకోశ జబ్బుతో బాధపడుతూ బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉండడం తెలిసిందే. మొదట మోకాలి శస్త్ర చికిత్స కోసం యశవంతపురలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా, శ్వాసకోస సమస్య మొదలైంది. దీంతో మెరుగైన చికిత్స కోసం ఈ ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూలో ఉంచి దేశ విదేశాల వైద్యనిపుణులు వైద్యం అందించినప్పటికీ పరిస్థితి మెరుగుపడలేదు. చివరికి ఆయన ప్రాణాలు విడిచారు. కుటుంబంతో పాటు కాంగ్రెస్‌ నాయకులు, అభిమానులు విచారంలో మునిగిపోయారు. సుధాకర్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

చెళ్లకెరె నుంచి ఎమ్మెల్యేగా

చిత్రదుర్గ జిల్లా చెళ్లెకెరెకు చెందిన సుధాకర్‌ పారిశ్రామికవేత్తగా ఉండేవారు. ఈయన చిన్నాన్న ఎస్‌.జయణ్ణ చెళ్లెకెర నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జయణ్ణ తరువాత సుధాకర్‌ రాజకీయ ప్రవేశం చేసి చెళ్లకెరె నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నియోజకవర్గ పునర్విభజన తరువాత ఆయన హిరియూరు నుంచి 2008లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి సత్తా చాటుకున్నారు. బీజేపీ యడియూరప్ప ప్రభుత్వానికి మద్దతునిచ్చి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2013 ఎన్నికల్లో హిరియూరు నుంచి కాంగ్రెస్‌ టికెట్‌తో గెలిచారు. తరువాత ఓటమి పాలైనా, 2023 ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ మంత్రి పదవిని చేపట్టారు. జైన సముదాయానికి చెందిన సుధాకర్‌, అన్నివర్గాల ఓటర్ల అభిమానాన్ని చూరగొన్నారు. సోమవారం మధ్యాహ్నం తరువాత చెళ్లకెరెలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరుగుతాయి. పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఆదివారమే హిరియూరుకు, ఆపై చెళ్లకెరెలోని స్వగృహానికి తీసుకెళ్లారు.

ప్రముఖుల నివాళులు

గవర్నర్‌ గెహ్లాట్‌, సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, బీజేపీ నేతలు యడియూరప్ప, ఆర్‌.అశోక్‌, చలవాది నారాయణస్వామి తదితరులు ఆస్పత్రికి వెళ్లి నివాళులర్పించారు.

3 రోజులు సంతాప దినాలు

మంత్రి సుధాకర్‌ గౌరవార్థం ప్రభుత్వం ఆదివారం నుంచి 12వ తేదీ వరకు మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. ఈ రోజుల్లో ఎలాంటి ప్రభుత్వ వేడుకలు జరగవు. చిత్రదుర్గ జిల్లాలో సోమవారం ప్రభుత్వ సెలవును ప్రకటించారు.

పార్థివ దేహానికి సీఎం సిద్దరామయ్య నివాళులు

ప్రమాణ స్వీకార వేడుకలో కుటుంబంతో మంత్రి సుధాకర్‌ (ఫైల్‌)

నాకు సన్నిహితుడు

డిప్యూటీ సీఎం తీవ్ర విచారం

మంత్రి డి.సుధాకర్‌ అప్పర్‌ భద్రా ప్రాజెక్ట్‌ కోసం పోరాడారు, ఆయన జ్ఞాపకార్థం ఆ పథకానికి సుధాకర్‌ పేరు పెట్టడం గురించి ఆలోచిస్తామని డీసీఎం శివకుమార్‌ తెలిపారు. ఇది చాలా దుఃఖకరమైన రోజు. నా సన్నిహిత మిత్రుడు, మంత్రి సుధాకర్‌ దూరమయ్యారు. గత ఒక నెల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. శస్త్రచికిత్స తరువాత శ్వాసకోశ వ్యాఽధికి గురయ్యారు. కోమాలోకి వెళ్లారు. ఈ మధ్య మళ్లీ కోలుకొన్నారు. ఆయన కోలుకుని వస్తారని విశ్వాసముండేది. విదేశాల నుంచి కూడా వైద్యులను పిలిపించి చికిత్స చేయించాం, కానీ ఆదివారం తెల్లవారజామున 3:15 గంటలకు తుదిశ్వాస విడిచారు అని డీసీఎం తెలిపారు. భారత జోడో యాత్రలో ఐదు రోజులు ఆయనే పర్యవేక్షించారు, మరణవార్తను రాహుల్‌గాంధీకి తెలిపాను అని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement