బొమ్మనహళ్లి: బెంగళూరు బొమ్మనహళ్ళి నియోజకవర్గం సింగంద్రలోని చన్నకేశవ నగరలో చెన్నకేశవ జాతర వేడుకలు నిర్వహించారు. ఆదివారం మండుటెండలో అన్నమ్మ దేవి రథం, కబ్బాలమ్మ దేవి రథం, రేణుకా యల్లమ్మ దేవి రథం, వీరభద్రస్వామి రథాలను భక్తజనం లాగారు. మంగళవాయిద్యాలు, కళాకారుల ప్రదర్శనల మధ్య తేర్లు ముందుకు కదలగానే భక్తులు అరటిపండ్లు విసిరారు.
కనువిందుగా కరగ
కోలారు: తాలూకాలోని చిట్నహళ్లి గ్రామంలో శనివారం రాత్రి ధర్మరాయస్వామి కరగ ఉత్సవ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పూజారి కాకినత్త బాలరాజ్ దేవాలయం ముందు వేదికపై మేళతాళాలకు అనుగుణంగా కరగను మోస్తూ చేసిన నృత్యం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ కరగ సంబరం సాగింది. అగ్నిగుండ ప్రవేశంతో ఉత్సవం ముగిసింది. వేలాది భక్తులు వీక్షించారు.
దేవీరమ్మ తేరు సంబరం
బొమ్మనహళ్లి: హాసన్ దగ్గర భువనహళ్లిలో ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జరిగే చారిత్రక దేవీరమ్మ జాతర మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శంభునాథ్ స్వామీజీ, కలెక్టర్ కె. లతాకుమారి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. దేవీరమ్మకు పూజలు రథోత్సవానికి నాంది పలికారు. భక్తులు దారి పొడవునా హారతి ఇస్తూ అమ్మవారిని స్వాగతించారు. పరిసర గ్రామాల నుంచి వేలాదిగా భక్తులు రావడంతో జాతర కిటకిటలాడింది.
బ్యాంకు ఖాతాలో
రూ.18 లక్షలు మాయం
యశవంతపుర: చిక్కమగళూరు జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. జనవరి నుంచి ఇప్పటివరకు 29 కేసులు నమోదయ్యాయి. మహిళల బ్యాంక్ ఖాతా నుంచి రూ.18.24 లక్షలు మాయమయ్యాయి. సైబర్ నేరగాళ్ల మోసాలకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. చిక్కమగళూరు నగరానికి చెందిన ఓ మహిళ ప్రైవేటు బ్యాంకు ఖాతా నుంచి పలు విడతలలో ఈ డబ్బులు పోయాయి. ఏపీకే, ఓటీపీ, లింక్‌లు ఏవీ ఆమె మొబైల్‌కు రాలేదు. అయినా బ్యాంక్ ఖాతాలోని డబ్బు మాయం కావడం చూస్తే ఇంటిదొంగల పాత్ర కూడా ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. మార్చి 4 నుంచి ఏప్రిల్ 21 వరకు వివిధ దినాలలో డబ్బులు డ్రా అయ్యాయి. బ్యాంక్ సిబ్బంది మీద అనుమానం వ్యక్తమవుతోంది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
లక్కుండిలో ప్రాచీన శిల లభ్యం
దొడ్డబళ్లాపురం: గదగ్ జిల్లా చారిత్రక లక్కుండి గ్రామంలో శనివారంనాడు కుంబార బావిని శుభ్రం చేస్తుండగా 9 లేదా 10వ శతాబ్దం నాటి రాతి శిల లభించింది. అందులో మొదట యుద్ధం జరగడం, తరువాత యుద్ధంలో మరణించిన వీరున్ని అప్సరసలు స్వర్గానికి తీసికెళ్లే దృశ్యాలు, వీరుడు స్వర్గంలో సేదతీరుతున్న వైనం చెక్కి ఉన్నాయి. శిలపై సూర్య చంద్రులు, శివలింగం, శివలింగాన్ని యువతి పూజిస్తున్న బొమ్మలు ఆకట్టుకునేలా ఉన్నాయి. కొన్నినెలల కిందట లక్కుండిలో ఓ ఇంటిలో బంగారు నిధి లభించడం, తవ్వకాలలో ప్రాచీన విగ్రహాలు దొరకడం తెలిసిందే.


