మైసూరు: ప్యాలెస్ సిటీలో రెండు చారిత్రక కట్టడాలను కాపాడుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మైసూరు వారసత్వ కట్టడాలైన దేవరాజ మార్కెట్, లాన్స్‌డౌన్ భవనాల పరిరక్షణ, పునరుద్ధరణకు నిధులు విడుదల చేయాలని స్థానిక ఎంపీ యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయార్.. సీఎం సిద్దరామయ్యకు విజ్ఞప్తి చేశారు. మైసూరు వారసత్వ కట్టడాలను పరిరక్షించడమే మా ప్రధాన లక్ష్యమని, ఈ మేరకు సీఎం లేఖ రాసినట్లు తెలిపారు. ఈ భవనాల పరిరక్షణకు ఈ ఏడాది మే 4న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా ముఖ్యమైనదని ఎంపీ చెప్పారు. ఈ కట్టడాలను కూల్చివేసి, కొత్త భవనాలను నిర్మించాలన్న ప్రతిపాదనను సుప్రీంకోర్టు తిరస్కరించిందని చెప్పారు. 19వ శతాబ్దానికి చెందిన భవనాలను పరిరక్షించి, పునరుద్ధరించడానికే ఈ తీర్పు వచ్చిందని అన్నారు.
మరమ్మతులు చాలు
రూర్కీ ఐఐటీ నిపుణుల కమిటీ సిఫార్సుల ప్రకారం 70 శాతం మరమ్మతులతో భవనాలు సుస్థిరంగా ఉంటాయన్నారు. ప్రస్తుతం ఉన్న పునాదులను పరిరక్షించి, పునరుద్ధరిస్తామని ఆయన అన్నారు. పునరుద్ధరణ ప్రాజెక్టును వెంటనే ప్రారంభించేలా మైసూరు నగరపాలక సంస్థ (ఎంసీసీ), మైసూరు అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఎండీఏ)లకు ఆదేశించాలని సీఎంను కోరినట్లు ఆయన తెలిపారు. 2024–25 బడ్జెట్‌లో దేవరాజ మార్కెట్ పునరుద్ధరణకు రూ.95 కోట్లు, లాన్స్‌డౌన్ భవనానికి రూ.35 కోట్లు గ్రాంటుగా ప్రకటించారని చెప్పారు. అవి కట్టడాలు మాత్రమే కాదని, అవి మైసూరు సజీవ సాంస్కృతిక, వాణిజ్య వారసత్వానికి ప్రతీకలని పేర్కొన్నారు.
మైసూరు దేవరాజ మార్కెట్,
లాన్స్‌డౌన్ భవనాల పునరుద్ధరణకు
ఎంపీ డిమాండ్


