మండ్య: రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని సృష్టించింది. మండ్య తాలూకాలోని పనకనహళ్లి సమీపంలో బెంగళూరు–మైసూరు ఎక్స్‌ప్రెస్ వేలో శుక్రవారం సాయంత్రం కారు బోల్తా పడటంతో తండ్రీకొడుకులు చనిపోయారు. తాలూకాలోని కచ్చిగెరె గ్రామానికి చెందిన కిరణ్ (40), కుమారుడు కిషోర్ (13) మృతులు. కుమార్తె కీర్తన (10) గాయపడగా, ఆమె మండ్య జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆల్టో కారులో పాండవపురలో ఓ పెళ్లికి వెళ్లిన ఈ ముగ్గురూ కచ్చిగెరె గ్రామానికి తిరిగి వస్తున్నారు. కిరణ్ కారు నడుపుతుండగా అతి వేగం వల్ల పనకనహళ్లి సమీపంలో డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. కారు ముక్కలు కావడం గమనార్హం. తీవ్రంగా గాయపడిన తండ్రీ కొడుకులు ఇద్దరూ అక్కడే మరణించారు. మృతదేహాలను మండ్య మిమ్స్ ఆస్పత్రికి తరలించగా కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. ఎస్పీ వి.జె. శోభారాణి, ఏఎస్పీ తిమ్మయ్య పరిశీలించారు.
ఎక్స్‌ప్రెస్ వేలో కారు పల్టీలు
తండ్రీ కుమారుడు మృతి


