సాక్షి, బళ్లారి: దక్షిణ భారత దేశంలో బీజేపీని అధికారంలోకి తీసుకు వచ్చిన మహా నాయకుడు బీ.ఎస్ యడియూరప్ప, క్లర్క్ స్థాయి నుంచి పురసభ సభ్యునిగా రాజకీయ అరంగ్రేటం చేసి రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేస్తూ, ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడుగా, నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. శనివారం చిత్రదుర్గలో మాజీ సీఎం యడియూరప్ప 50 ఏళ్ల ప్రజాజీవితాన్ని పురస్కరించుకుని అభిమానోత్సవాన్ని నిర్వహించారు. అమిత్ షాతో సహా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, అభిమానులు ఈ సభకు తరలివచ్చారు.
ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరై ప్రసంగిస్తూ యడియూరప్పను పొగడ్తలతో ముంచెత్తారు. బీజేపీ కోసం జీవితాన్ని అంకితం చేసిన నాయకుడన్నారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి సైకిల్ ద్వారా గ్రామ గ్రామాన్ని చుట్టి ఎంతో శ్రమించారన్నారు. ఏసీ గదుల్లో కూర్చొని, ఆయన రాజకీయాలు చేయలేదని, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, నిరంతరం ప్రజల కోసం పని చేసిన వ్యక్తి అన్నారు. 2008లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకుని రావడంతో దక్షిణ భారత దేశంలో బీజేపీ ప్రవేశానికి కారకుడయ్యారన్నారు.
రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడానికి కేంద్ర మంత్రి పదవిని కూడా యడియూరప్ప తిరస్కరించారని అమిత్ షా తెలిపారు.
కోట్లాది మంది అభిమానులను కూడగట్టుకున్నారని, ఎంతో మంది స్వామీజీలు, జగద్గురువులు , లక్షలాది మంది జనం పాల్గొనడమే ఇందుకు నిదర్శనం అన్నారు. రైతుల సంక్షేమమే దేశ సౌభాగ్యంగా భావించిన నాయకుడని అన్నారు. రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారన్నారు. రాజకీయాల్లో తాము ఒక్కరే ఎదగాలని అందరూ భావిస్తారని, అయితే యడియూరప్ప తన చుట్టు ఉన్న వారు, కార్యకర్తలను రాజకీయ నాయకులుగా ఎదిగేందుకు కృషి చేశారన్నారు. యువ నాయకులు ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.
అసామాన్యుడు
● ప్రధాని మోదీ సందేశం
ప్రజాజీవితంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న యడియూరప్ప సామాన్య వ్యక్తిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, అసామాన్యుడుగా ఎదిగారని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఆయన జీవితం ప్రతి యువతకు ఆదర్శనీయమని అన్నారు. లక్షలాది మంది పాల్గొన్న ఈ సమావేశానికి తాను పలు కారణాలతో హాజరు కాలేకపోయానని, అయితే తన మనస్సు అంతా ఇక్కడే ఉందని ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చదివి వినిపించారు. ఎన్నో ఏళ్లు యడియూరప్పతో కలిసి పార్టీ అభివృద్ధికి, దేశాభివృద్ధికి పని చేశానని మోదీ చెప్పారు. పార్టీని పల్లె పల్లెకూ తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యడియూరప్పను నేతలు ఘనంగా సన్మానించారు.
యడియూరప్పపై ప్రధాని మోదీ, అమిత్‌షా ప్రశంసల జల్లు
చిత్రదుర్గంలో అట్టహాసంగా అభిమానోత్సవ వేడుక
హాజరైన బీజేపీ ప్రముఖులు
మీ రుణం తీర్చుకోలేనిది: యడ్డి
సుదీర్ఘ 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో అటుపోట్లు, కష్టాలు, బాధలు అనుభవించానని, ప్రతి విజయంలోను తన వెంట అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నడవడం మరిచిపోలేనని, మీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిదని యడియూరప్ప పేర్కొన్నారు. ఆయన ఎంతో ఉద్వేగంగా ప్రసంగించారు. ఊపిరి ఉన్నంత వరకు పార్టీ కోసం, ప్రజల కోసం పని చేస్తానన్నారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా ఇద్దరూ దేశాభివృద్ధికి బాటలు వేశారన్నారు. మోదీ అవతార పురుషుడని కొనియాడారు. మరో 10 ఏళ్ల పాటు మోదీనే దేశ ప్రధానిగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అతిథులు యడియూరప్ప సేవలను ప్రస్తుతిస్తూ ప్రసంగించారు.


