● చిక్క తిరుపతిలో విశేష పూజలు
మాలూరు: ప్రసిద్ద యాత్రాస్థలం అయిన చిక్కతిరుపతి గ్రామంలోని శ్రీ ప్రసన్న వెంకట రమణస్వామి దేవాలయానికి రెండవ శనివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు. వేసవి సెలవులు కావడంతో బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి భక్తజనం వచ్చారు. ప్రధాన అర్చకులు గోపాలకృష్ణ భరద్వాజ్, ఎన్ శ్రీధర్, కార్తీక్‌ల నేతృత్వంలో మూల విగ్రహానికి అభిషేకం, పంచామృత అభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూలతో స్వామి వారిని అలంకరించారు.
గిగ్ కార్మికులకు
సర్కారు వెబ్‌సైట్
బనశంకరి: డెలివరీ బాయ్స్ తదితర గిగ్ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ వేదికను ప్రారంభించింది. ఆ వెబ్‌సైట్‌లో కార్మికుల తమ ఇబ్బందుల గురించి ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే, సదరు కంపెనీలకు ప్రభుత్వం బదిలీచేసి పరిష్కారం కనుగొంటారు. ఈ పోర్టల్ కార్మికులు– కంపెనీల మధ్య వారధిగా ఉంటుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి అనేక కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని కార్మిక శాఖ అధికారులు తెలిపారు. ప్రతి కంపెనీ కూడా అంతర్గత వివాదాల పరిష్కార కమిటీలను కచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఇప్పటివరకు 12 లక్షల గిగ్ కార్మికుల వివరాలను పోర్టల్‌లో నమోదు చేశారని తెలిపారు. ప్రతి కార్మికునికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను అందించడం ద్వారా నకిలీల నమోదును తొలగిస్తున్నామని తెలిపారు.
గుడికి వెళ్లివచ్చేలోగా ఇల్లు లూటీ
మైసూరు: ఇంటి యజమాని లేని సమయంలో చొరబడిన దొంగలు బీరువాలోని సుమారు రూ.2.25 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దోచుకున్నారు. ఈ ఘటన మైసూరు తాలూకా ఇలవాల సమీపంలో జరిగింది. ఓ కంపెనీలో మేనేజర్‌గా పనిచేసే ప్రవీణ్‌కుమార్ వినాయక ఎన్‌క్లేవ్‌లో నివసిస్తుంటారు. ఇంటికి తాళం వేసుకుని ఒంటికొప్పలు సమీపంలోని గుడికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చి చూడగా తలుపు తెరిచి ఉండటం కనిపించింది. కిటికీ అద్దాలు పగిలిపోయి ఉన్నాయి, ఇంట్లోకి వెళ్లి చూడగా చోరీ జరిగిన విషయం తెలిసింది. ఇలవాల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
నదిలో అక్కా చెల్లి జలసమాధి
యశవంతపుర: ఈతకెళ్లిన బాలిక, యువతి నీటిపాలైన ఘటన దక్షిణకన్నడ జిల్లా కడబ తాలూకాలో జరిగింది. గుండ్యకు చెందిన నలుగురు అమ్మాయిలు స్థానిక నదిలో ఈత కొట్టాలని వెళ్లారు. లోతైన చోటుకు వెళ్లడంతో నీటిలో మునిగిపోయారు. వారిలో సునీత (21). అర్పిత (15)లు మునిగిపోగా, మిగతా ఇద్దరూ కేకలు వేశారు. దగ్గరలో ఉన్నవారు వచ్చి రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. ఇద్దరి మృతదేహాలను నదిలో నుంచి బయటకు తీశారు. వీరిద్దరూ అక్కా చెల్లెలని తెలిసింది. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కడబ పోలీసులు కేసు నమోదు చేశారు.
పసికందును
చంపిన వీధి కుక్క
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో వీధి కుక్కల దురాగతాలు అధికయ్యాయి. నిత్యం ఎక్కడో ఓ చోట జనంపై దాడులు చేస్తున్నాయి. బీదర్ జిల్లాలో ఘోరం జరిగింది. 5 నెలల పసికందుని వీధికుక్క బలితీసుకుంది. హుమ్నాబాద్ తాలూకా దుబలగుండి గ్రామంలో సిద్ధప్ప, సుధ దంపతుల కుమార్తె శివాని (5 నెలలు). శిశువు వారికి 4వ సంతానం. ఇంటి ఆవరణలో కుమార్తెను పడుకోబెట్టి తల్లి పని చేసుకుంటుండగా ఓ వీధి కుక్క చొరబడి చిన్నారిని తీవ్రంగా గాయపరిచింది. తల్లి కేకలు వేసి కుక్కను తరిమేసింది. చిన్నారిని బ్రిమ్స్ జిల్లా ఆస్పత్రికి తరలించగా, కొంతసేపటికి పసికందు మరణించడంతో తల్లి బోరున విలపించింది. అటవీ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఆ కుటుంబానికి సంతాపం తెలిపారు.


