తుమకూరు: వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆనందంగా పుణ్యక్షేత్రానికి వెళ్లివస్తున్న దంపతులతో పాటు బంధువులు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. తుమకూరు జిల్లాలోని కుణిగల్ తాలూకాలో హైవే – 33లో హొన్నెనహళ్లి సమీపంలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మండ్య జిల్లాలోని స్వర్ణనగరకు చెందిన శుభ (60), కె.ఆర్. గాయత్రి (60), ఈమె భర్త కుమార్ నరసింహమూర్తి (65), కారు డ్రైవర్ రఘు కుమార్ (56) మృతులు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందినవారని తెలిసింది. గాయత్రీ, కుమార్‌ల 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తుమకూరులోని దేవరాయనదుర్గలో ఉన్న యోగనరసింహ స్వామి ఆలయంలో పూజలు చేసుకుని కారులో సొంతూరికి వెళ్తున్నారు. ఘటనాస్థలంలో ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఒక లారీ వేగంగా వచ్చి వీరి కారును ఢీకొట్టింది.
ఎగిరిపడిన కారు
ఆ ధాటికి కారు దూరంగా ఎగిరిపడగా, నలుగురూ దుర్మరణం చెందారు. కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. స్థానికులు, కుణిగల్ పోలీసులు కారులోనుంచి మృతదేహాలను వెలికితీసి ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఇదే ప్రాంతంలో మూడు రోజుల వ్యవధిలో రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మరణించారు. ప్రమాద స్థలంలో హైవే, స్థానిక అధికారులు ఎలాంటి పరిష్కార చర్యలు చేపట్టకపోవడంతో ప్రాణనష్టం జరుగుతోంది.
ఆలయానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం
దంపతులు, బంధువుల మృతి
తుమకూరు జిల్లాలో ఘటన


