బనశంకరి: రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన బిట్‌కాయిన్ కుంభకోణంలో బెంగళూరులో ఈడీ అధికారులు సూత్రధారి శ్రీకృష్ణతో పాటు ముగ్గురిని శనివారం అరెస్ట్ చేశారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వ ఈ–ప్రొక్యూర్‌మెంట్ వెబ్‌సైట్‌ను హ్యాక్‌చేసి కోట్లాది రూపాయలను దోచుకున్నారని వీరిపై కేసు నడుస్తోంది. గతంలో సిట్ దర్యాప్తులో హ్యాకర్ శ్రీకృష్ణ చే అనేక డిజిటల్ వ్యాలెట్లు చోరీ అయినట్లు వెల్లడైంది.
ఈ కేసుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే హ్యారిస్ కుమారుడు మహమ్మద్ నలపాడ్‌ను రెండుసార్లు సిట్ విచారించింది. ఇప్పుడు శ్రీకృష్ణను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు మరికొందరి పాత్రపై కూపీలాగుతున్నారు.
భారీగా నగదు మార్పిడి
ఏప్రిల్‌లో ఎమ్మెల్యే హ్యారిస్, నలపాడ్ నివాసాలలో ఈడీ అధికారులు రోజంతా సోదాలు చేపట్టడం తెలిసిందే. శ్రీకృష్ణ హ్యాక్ చేసిన బిట్‌కాయిన్‌లను క్రిప్టో ద్వారా నగదుగా మార్చుకుని పలువురికి బదిలీ చేసినట్లు అనుమానాలున్నాయి. శ్రీకృష్ణ ముంబైకి చెందిన వ్యక్తి ద్వారా నలపాడ్ అకౌంట్ కు రూ.10 లక్షలు జమ చేసినట్లు ఆరోపణలున్నాయి. మొత్తం రూ.4.5 కోట్ల అక్రమ కార్యకలాపాలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. గతంలో సిట్, ఇటీవల సోదాల్లో సేకరించిన సమాచారం ఆధారంగా ఇప్పుడు శ్రీకృష్ణను అరెస్ట్ చేశారు. దీంతో కొందరు చిక్కుల్లో పడే అవకాశం ఉంది. శ్రీకృష్ణ అరెస్ట్ బెంగళూరు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.
బిట్‌కాయిన్ల దోపిడీ కేసుల్లో అరెస్టు
మరికొందరి పాత్రపై కూపీ
బెంగళూరులో కలకలం


