హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకాలోని ఉప్పారగట్టి గ్రామంలో శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం, పిడుగు పాటు కారణంగా 35 గొర్రెలు, మేకలు మృత్యువాత పడ్డాయి. గొర్రెల యజమాని ఉప్పార బీ.అజ్జప్పకు చెందిన 30 గొర్రెలు, గొల్లర పీ.సురేష్‌కు చెందిన ఐదు గొర్రెలు సాయంత్రం చెరువు సమీపంలో మేత మేస్తూండగా వర్షం ప్రారంభమై పిడుగు పడింది. చినుకుల నుంచి తప్పించుకునేందుకు చెట్టు కింద నిలబడి ఉన్న గొర్రెలపై పిడుగు పడింది. సమాచారం అందుకున్న తహసీల్దార్ ఆర్.కవిత, విపత్తు నిర్వహణ శాఖ అధికారి డాక్టర్ సూరప్ప, పశుసంవర్ధక శాఖ అధికారులు శనివారం ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రకృతి విలయం కారణంగా నష్టపోయిన గొర్రెల కాపరులకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.


