కవితాళ వద్ద కాలువ గట్టుపై పెరిగిన ముళ్ల కంపలు
మమదాపుర వద్ద కాలువలో మొలిచిన పిచ్చిమొక్కలు
గంగానగర క్యాంప్ వద్ద ధ్వంసమైన కాలువ గట్టు
రాయచూరు రూరల్: గత కొన్నేళ్ల నుంచి వర్షాభావంతో జిల్లా ప్రజలు, రైతులు తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొంటుండగా, ఉన్న నీటి వనరులనైనా వినియోగించి రైతులను ఆదుకోవాలన్న ధ్యాస అధికారులకు, ప్రజాప్రతినిధులకు లేకుండా పోతోంది. తుంగభద్ర ఎడమ కాలువ కింద ఆయకట్టు చివరి భూముల రైతుల పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా తయారైంది. పంట భూములు తమ కళ్ల ముందే బీళ్లుగా మారిపోతుంటే రైతులు తల్లడిల్లిపోతున్నారు.
కాలువల నిండా పిచ్చిమొక్కలు
పిచ్చి మొక్కలు, పూడికలతో కాలువలు పూడి పోయాయి. జిల్లాకు వర్షాభావం శాపమైతే, పాలకుల ఽశీత కన్ను ఎడమ కాలువ పాలిట శాపమైంది. జిల్లాకు వర ప్రసాదమైన ఎడమ కాలువకు ఆధునికీకరణ పేరుతో ప్రతి ఏటా కోట్లాది రూపాయలు మంజూరవుతున్నా పనులు మాత్రం ఎక్కడా సక్రమంగా జరగడం లేదు. కాలువ మొదట్లో నీరు వదిలితే రెండు మూడు రోజులకే గండ్లు పడుతుండేవి. చివరి భూములకు నీరు అందడం గగనంగా మారేది. సెంటీమీటర్ ఎత్తున కూడా కాలువల్లో నీరు పారిన పాపాన పోలేదు.
మరమ్మతు పనుల్లో నాణ్యత డొల్ల
ఎడమ కాలువ మరమ్మతు పనులు నామ మాత్రానికే నాణ్యతకు అద్దం పడుతున్నాయి. కాలువల్లో పూడిక తీయించినట్లు, జంగిల్ కటింగ్ చేసినట్లు కాంట్రాక్టర్లు రికార్డులు చూపించి సొమ్ము స్వాహా చేస్తున్నారు. వీటంతటికీ ఉన్నతాధికారులు, నాయకుల అండదండలు ఉండడంతో తుంగభద్ర ఎడమ కాలువ కాంట్రాక్టర్లకు కామధేనుగా మారింది. 99వ డిస్ట్రిబ్యూటరీ నుంచి 102వ డిస్ట్రిబ్యూటరీ వరకు కాంట్రాక్టర్లు పీస్ వర్కుల పేరుతో పనుల కేటాయించుకుని పీస్ పనులకు రూ.90 వేలుగా నిర్ణయించారు.
అధ్వానంగా ఉప కాలువలు
గత మూడేళ్ల నుంచి తుంగభద్ర ఎడమ కాలువలో పూడిక పేరుకుంది. పిచ్చి మొక్కలు, ముళ్ల కంప చెట్లు మొలిచాయి. కాంగ్రెస్ సర్కార్ నిధులను పంచ గ్యారంటీలకు వినియోగించడంతో కాలువల పనులకు నిధులు లేకపోవడంతో ఉప కాలువలు అధ్వానంగా మారాయి. రాయచూరు జిల్లాలో సింధనూరు, మాన్వి, కవితాళ, సిరవార, రాయచూరు ప్రాంతాలకు సాగునీరు ప్రవహిస్తాయి.
కొన్నేళ్లుగా వర్షాభావం,
తీవ్ర దుర్భిక్ష పరిస్థితి
రైతుల రక్షణపై సర్కార్‌కు
కొరవడిన చిత్తశుద్ధి


