రాయచూరు రూరల్: సీహెచ్ పౌడర్ విక్రయించిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ బసవరాజ్ వెల్లడించారు. నగరంలోని బోళమానుదొడ్డి శ్రీకృష్ణ దేవరాయ కాలనీలో మారెప్ప(52) అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 84 లీటర్ల సీహెచ్ పౌడర్ ప్యాకెట్లను స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
రైతు మహిళలకు బ్యాంక్ రుణాలు
రాయచూరు రూరల్: మహిళలకు, రైతులకు బ్యాంక్ నుంచి రుణాలిస్తామని ఢిల్లీకి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏజీఎం దీప్ కుమార్ పేర్కొన్నారు. నగరంలోని ప్రైవేట్ భవనంలో వ్యవసాయ మేళాను ప్రారంభించి ఆయన మాట్లాడారు. రాయచూరు జిల్లాలో స్వసహాయ మహిళా గుంపులకు ఈ ఏడాది రూ.6 కోట్ల మేర రుణాలిచ్చామన్నారు. రాష్ట్రంలో 240 ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు రైతులు, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే ఉద్దేశ్యంతో రుణాలిచ్చి వారిని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హుబ్లీ ఆర్‌ఎంఓ సూర్యమని సాహూ, అశోక్, షేక్ అస్రార్, రవీంద్ర నాథ్ సింగ్, విశాల్, శంకర్, ఆనంద్, బాలకృష్ణ, పద్మలున్నారు.
కసాయిల బారి నుంచి
రక్షించండి
రాయచూరు రూరల్ : నగరంలోని పశువుల సంతలో విక్రయానికి తెచ్చిన పశువులను ఇతర చోటికి తరలించడానికి కసాయిలు ఇబ్బందులు కలిగిస్తున్నారని, వారి నుంచి రైతులను రక్షించాలని హిందూ మంచ్ ఏక్తా మైనార్టీ సంఘం డిమాండ్ చేసింది. శనివారం ఎస్పీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు ఫైజల్ ఖాన్ మాట్లాడారు. జిల్లాలో ఖురేషి సమాజం వారు జంతువులను కొనుగోలు చేయడం, ఇతర సంతల్లో వాటిని విక్రయించడం పరిపాటి అని, దానిని ఆసరాగా చేసుకొని కసాయిలు వారిపై దాడి చేసి, పశువులను లాక్కొని తక్కువ ధరకు ఇవ్వాలని వేధించడం వంటి సంఘటనలు పునరావృతం కావడం వల్ల అలాంటి వారి బారి నుంచి రక్షించాలని కోరుతూ ఎస్పీ అరుణాంగ్శు గిరికి వినతిపత్రం సమర్పించారు.
అభిమానోత్సవానికి
బస్సుల మళ్లింపు
● బస్టాండ్‌లో ప్రయాణికుల లబోదిబో
హొసపేటె: నగరంలో శనివారం సరిగా ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తమ ఊర్లకు వెళ్లేందుకు బస్సులు లేక బస్టాండ్‌లో గంటల తరబడి వేచి ఉండి నానా ఇబ్బంది పడ్డారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్.యడియూరప్ప 50 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో పొరుగు జిల్లా చిత్రదుర్గలో ఏర్పాటు చేసిన అభిమానోత్సవానికి ఒప్పంద ప్రాతిపదికన బస్సులన్నీ మళ్లించగా, బస్సులు లేక గమ్యస్థానాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు నరకయాతన పడ్డారు. బస్టాండ్‌లో ప్రయాణికులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ బస్టాండ్‌కు బస్సులు రాకపోవడం వల్ల సండూరు, కొప్పళ, కంప్లి, బళ్లారి, గంగావతి, కూడ్లిగి, కొట్టూరు, హగరిబొమ్మనహళ్లి, హగడలి వంటి పట్టణాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులు పడ్డారు.
నియామకం
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా విద్యా శాఖాధికారిగా మల్లికార్జునను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇక్కడ విధులు నిర్వహిస్తున్న బడిగేరను గదగ్‌కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో రాయచూరు డయట్ సీనియర్ అధ్యాపకుడిగా, దేవదుర్గ తాలూకా విద్యాశాఖాధికారిగా పని చేస్తున్న మల్లికార్జునను నియమించారు.


