హొసపేటె: జిల్లాలో దీర్ఘకాలంగా ఉన్న విద్యుత్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు సుమారు రూ.50 కోట్ల వ్యయంతో విద్యుత్ సబ్ స్టేషన్లను నిర్మిస్తామని, రైతుల ఆకాంక్ష అయిన చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరిస్తామని ఎమ్మెల్యే హెచ్‌ఆర్ గవియప్ప పేర్కొన్నారు. హొసపేటె నగర శివార్లలోని నాగేనహళ్లిలో నిర్మించనున్న విద్యుత్ సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలో తరచుగా ఏర్పడుతున్న విద్యుత్ సరఫరా అంతరాయాలకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు రెండు పెద్ద సబ్‌స్టేషన్ల నిర్మాణాన్ని ప్రారంభించామన్నారు. జిల్లాధికారి కార్యాలయ ప్రాంగణంలో పట్టణ ప్రాంత అవసరాలను తీర్చడానికి రూ.23.26 కోట్ల వ్యయంతో, నాగేనహళ్లిలో రూ.27 కోట్ల వ్యయంతో మరో సబ్‌స్టేషన్‌తో పాటు కొత్త పవర్ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తారన్నారు.
రాయరకెరె స్టేషన్ అప్‌గ్రేడ్
రాయరకెరెలోని పాత సబ్‌స్టేషన్‌ను 220 ఎంవీఏ సామర్థ్యానికి అప్‌గ్రేడ్ చేస్తున్నారన్నారు. ఇది ఈ ప్రాంత ప్రజలకు నిరంతర విద్యుత్‌ను అందిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టులు సెప్టెంబర్ 2027 నాటికి పూర్తయి ప్రజా సేవకు అందుబాటులోకి వస్తాయన్నారు. పనులు పూర్తయిన తర్వాత తోరణగల్లు, మునిరాబాద్ లైన్లపై ఆధారపడటం తగ్గుతుందన్నారు. స్థానిక విద్యుత్ నిర్వహణ సులభతరం అవుతుందని అన్నారు. దశాబ్దాలుగా మూతపడిన చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరించాలన్న రైతుల ఆకాంక్షకు ప్రభుత్వం ఎట్టకేలకు సానుకూలంగా స్పందించింది. తమిళనాడు నమూనాను అనుసరించి, ప్రైవేట్ భాగస్వామ్యంతో కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోనున్నారన్నారు. దీని వల్ల రైతులకు చెరకుకు సరైన ధర లభించడమే కాకుండా, సకాలంలో పంట కోత ప్రక్రియ కూడా సులభతరం అవుతుందని ఆయన అన్నారు.
త్వరలో జిల్లా ఆస్పత్రి ప్రారంభం
జిల్లా ఆస్పత్రి త్వరలో ప్రారంభం కానుందన్నారు. జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన, అన్ని సౌకర్యాలతో కూడిన జిల్లా ఆస్పత్రి ప్రారంభోత్సవానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందన్నారు. 90 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. ఆస్పత్రికి అవసరమైన వైద్య పరికరాల సేకరణ, సిబ్బంది నియామక ప్రక్రియలు తుది దశలో ఉన్నాయన్నారు. ఈ అద్భుతమైన ఆస్పత్రి ప్రారంభోత్సవ తేదీకి సంబంధించిన సమాచారాన్ని రాబోయే 15– 20 రోజుల్లో తెలియజేస్తామని ఆయన అన్నారు. జిల్లా గ్యారంటీ పథకాల అమలు సమితి అధ్యక్షుడు శివమూర్తి, జిల్లా ఎస్పీ జాహ్నవి, ఏఎస్పీ మంజునాథ్, డీఎస్పీ డాక్టర్ మంజునాథ్, జిల్లా పట్టణాభివృద్ధి ప్రాజెక్ట్ డైరెక్టర్ మనోహర్, కేపీటీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హెచ్‌ఎం నటరాజ్, తహసీల్దార్ శృతి టీపీ ఈఓ ఆలం బాషా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరిస్తాం
ఎమ్మెల్యే హెచ్‌ఆర్ గవియప్ప హామీ


