బళ్లారిఅర్బన్: నగరంలోని ఏడు ఇందిరా క్యాంటీన్లలో శుక్రవారం అల్పాహార పంపిణీ నిలిచి పోయింది. క్యాంటీన్ సిబ్బందికి పలు మాసాలుగా వేతనాలు చెల్లించక పోవడమే ఇందుకు కారణమని తెలిసింది. నగరంలోని మోతీ సర్కిల్, ఓపీడీ, ట్రామా కేర్ సెంటర్, బాపూజీ నగర్, జిల్లా ఆస్పత్రి, బెళగల్లు క్రాస్ ప్రాంతాల్లో ఇందిరా క్యాంటీన్లు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్దరామయ్య పేద ప్రజలు ఆకలితో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్యాంటీన్లను ప్రారంభించారు. ఇక్కడ ఉదయం రూ.5కే అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి రూ.10 కే భోజనం అందిస్తున్నారు. దీనికి అవసరమైన సబ్సిడీ మొత్తాన్ని స్థానిక సంస్థలు భరిస్తున్నాయి. నగరంలోని ఏడు క్యాంటీన్లలో ప్రతిరోజూ సుమారు 3 వేల మందికి పైగా ప్రజలకు భోజనం, అల్పాహారం అందిస్తున్నారు. ఇందుకోసం నెలకు రూ.13 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు నగర పాలక సంస్థ విడుదల చేస్తోంది.
9 నెలలుగా అందని నిధులు
క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన కాంట్రాక్ట్ సంస్థకు గత తొమ్మిది నెలలుగా పాలక సంస్థ నుంచి నిధులు అందక పోవడంతో అక్కడ పని చేస్తున్న 50 మందికి పైగా సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు చెల్లించలేదని సమాచారం. దీంతో సిబ్బంది శుక్రవారం నుంచి అల్పాహారం, భోజనాల తయారీ, పంపిణీని నిలిపి వేయాలని నిర్ణయించారు. దీంతో ఉదయం నగరంలోని అన్ని ఇందిరా క్యాంటీన్లలో అల్పాహారం సరఫరా కాలేదు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో క్యాంటీన్ల నిర్వాహకులతో వెంటనే స్పందించి సిబ్బందికి బాకీ వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మధ్యాహ్నానికి వంటలు సిద్ధం చేసి భోజన సరఫరాను పునఃప్రారంభించారు. ఇంకా ఐదు నెలల బాకీ నిధులు విడుదల కావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నాయకుడు శివరాజ్ హెగ్డే మాట్లాడుతూ ఇందిరా క్యాంటీన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మూత పడకూడదు. నగర పాలికె సకాలంలో నిధులు విడుదల చేయాలని ఒత్తిడి చేశారు.
వేతనాల కోసం క్యాంటీన్ సిబ్బంది ధర్నా
ఉదయం అల్పాహార పంపిణీ నిలిపివేత


