సాక్షి బళ్లారి: జిల్లాలో సాగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి జిల్లా ఎస్పీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోగా, ఎస్పీ వద్ద పని చేసే గన్‌మెన్ దేవరాజు కంచే చేను మేసిన చందంగా అక్రమ బియ్యం రవాణా చేస్తున్న వారి నుంచి రూ.3 లక్షలు లంచం తీసుకోవడం కలకలం రేపింది. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ సుమన పన్నేకర్‌కు బాధితుడు తెలిపిన నేపథ్యంలో సీరియస్‌గా తీసుకొన్న ఆమె దర్యాప్తు చేయించి నిజం అని తేలడంతో తన గన్‌మెన్ దేవరాజును సస్పెండ్ చేయడంతో పాటు అరెస్ట్ చేయించారు. ఈ విషయంపై శుక్రవారం జిల్లా ఎస్పీ తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తన గన్‌మెన్ దేవరాజు, అతని స్నేహితుడు గతనెల 27న అక్రమ బియ్యం రవాణా చేసే శరభయ్య అనే వ్యక్తి నుంచి రూ.3 లక్షలు లంచం తీసుకున్నట్లు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సమగ్రంగా తనిఖీ చేశామన్నారు.
రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసి..
రేషన్ బియ్యాన్ని ఆంధ్రప్రదేశ్ వైపు తరలిస్తుండగా అడ్డుకొని ఎస్పీ స్క్వాడ్ అని బెదిరించి వారి దగ్గర నుంచి ముందుగా రూ.5 లక్షలు డిమాండ్ చేశారన్నారు. చివరకు రూ.3 లక్షలకు డీల్ కుదుర్చుకుని సొమ్ము వసూలు చేసినట్లు వెలుగులోకి వచ్చిందన్నారు. దేవరాజుకు సహకారం అందించిన లాయర్ గాదిలింగ పరారీలో ఉన్నాడని, మరో వ్యక్తి సాయిరాంను అరెస్టు చేశామన్నారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్, కారును కూడా సీజ్ చేశామన్నారు. ఎస్పీ స్క్వాడ్, ఐజీ స్క్వాడ్ అనే ప్రత్యేక బృందాలు లేవని స్పష్టం చేశారు. స్క్వాడ్ పేరు చెప్పి పోలీసులు ఎవరైనా ఇలాంటి కృత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బస్సు పల్టీ–విద్యార్థి మృతి
● 50 మందికిపైగా ప్రయాణికులకు గాయాలు
దొడ్డబళ్లాపురం: యాక్సిల్ కట్ కావడంతో కేఎస్ ఆర్టీసీ బస్సు పల్టీ కొట్టి విద్యార్థి మృతి చెందగా 50మందికి పైగా ప్రయాణీకులు గాయపడ్డారు. ఈ ఘటన దావణగెరె జిల్లా చెన్నగిరి తాలూకా మరబనహళ్లి వద్ద చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం 9–30 గంటల సమయంలో దావణగెరె నుంచి బసవాపట్టణకు బయలుదేరిన బస్సు చెన్నగిరి తాలూకా మరబనహళ్లి వద్దకు రాగానే యాక్సెల్ కట్ కావడంతో అదుపుతప్పి రోడ్డు పక్కకు పల్టీ కొట్టింది. ప్రమాదంలో దర్శన్ అనే కళాశాల విద్యార్థి మృతిచెందగా 50మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. బసవాపట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను దావణగెరె జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
సుప్రీంకోర్టులో రాజేగౌడ సవాల్
● శృంగేరి ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్
ఓట్ల లెక్కింపు వివాదం
● హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై పైకోర్టును ఆశ్రయించిన వైనం
దొడ్డబళ్లాపురం: శృంగేరి నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ పరాజిత అభ్యర్థి టీడీ రాజేగౌడ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల రీకౌంటింగ్‌కు హైకోర్టు ఆదేశాలు ఇవ్వగా ఈ ఆదేశాలను ప్రశ్నిస్తూ రాజేగౌడ సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని అప్పట్లో ఓడిన అభ్యర్థి డీఎన్ జీవరాజ్ హైకోర్టుకు వెళ్లారు. పిటిషన్ విచారణ జరిపిన హైకోర్టు తిరస్కరించిన 279 ఓట్లను మళ్లీ లెక్కించాలని, వాటిలో లోపాలు లేకుంటే వాటిని ఓట్లుగా పరిగణించాలని ఆదేశాలిచ్చింది. దీంతో తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించగా డీఎన్ జీవరాజ్ ఎన్నికల్లో గెలిచినట్లు ప్రకటించారు. తన ఎమ్మెల్యే పదవికి గండం రావడంతో రాజేగౌడ ప్రస్తుతం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
త్వరలో తమిళనాడు
రాజకీయ సమస్య పరిష్కారం
యశవంతపుర: తమిళనాడులో ఏర్పడిన రాజకీయ పరిస్థితులు రెండు రోజుల్లో సమిసిపోయే అవకాశం ఉన్నట్లు కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు. శుక్రవారం ఉదయం హాసన జిల్లా మావినకెరె రంగనాథస్వామి కొండలో దేవుడిని దర్శించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పెద్ద పార్టీగా అవతరించిన టీవీకేని కాదని ఏఐఏడిఎంకే, డీఎంకేలు కలిసి పొత్తు ఏర్పరచుకుని అధికారంలో వస్తారని తాను అనుకోవటం లేదని అభిప్రాయ పడ్డారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. న్యాయ సలహాలు తీసుకుని ప్రభుత్వ రచనకు చర్యలు తీసుకుంటారన్నారు.
బియ్యం అక్రమ రవాణాపై
ఎస్పీ గన్‌మెన్ దౌర్జన్యం
రూ.3 లక్షలు లంచం తీసుకొన్నట్లు
వెలుగులోకి
గన్‌మెన్ దేవరాజును సస్పెండ్ చేసిన జిల్లా ఎస్పీ
ఈ కేసులో గన్‌మెన్‌తో పాటు
మరొకరు అరెస్టు


