● రూ. 1.25 కోట్ల విలువైన సరుకు స్వాధీనం
● ఇద్దరు బిహార్‌వాసుల అరెస్ట్
బొమ్మనహళ్లి: సంచుల్లో కోళ్లదాణ నింపి దాని మధ్యలో గంజాయి ఉంచి లారీలో సరఫరా చేస్తుండగా బెంగళూరు జిగణి పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టి గుట్టు రట్టు చేశారు. కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాపై పక్కా సమాచారంతో ఆనేకల్ తాలూకా బేగూర్ మెయిన్ రోడ్డులోని కొప్ప సమీపంలో పోలీసులు కాపుగాశారు. ఆ సమయంలో వచ్చిన లారీని ఆపి తనిఖీ చేయగా కోళ్ల దాణ సంచుల్లో 250 కిలోల గంజాయి బయట పడింది. దీంతో గంజాయిని స్వాధీనం చేసుకొని బిహార్‌కు చెందిన రామాయణ్ యాదవ్ (56) సబీర్ ఖాన్ (51)ను అరెస్ట్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.1.25 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. కాగా గంజాయి రవాణా ఘటనలో వినోద్ సింగ్, బాబు అనే స్మగ్లర్లు తప్పించుకున్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. జిగణి పోలీసుల పనితీరును బెంగళూరు రూరల్ ఎస్పీ పి. చంద్రకాంత్ అభినందించారు.
వైద్యుడు బలవన్మరణం
● మనస్తాపంతో నర్స్ ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: ఒకే ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్, నర్స్ రెండు రోజుల తేడాలో ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన కనకపుర పట్టణంలోని మహదేశ్వర కాలనీలో చోటు చేసుకుంది. స్థానిక నవోదయ ఆస్పత్రిలో వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ చేతన్ కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే ఆస్పత్రిలో నర్స్‌గా పని చేస్తున్న సరస్వతి(45) గురువారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరూ ఈ ఆస్పత్రిలో చాలా ఏళ్లుగా పని చేస్తున్నారు. డాక్టర్ మృతిని తట్టుకోలేక సరస్వతి మనోవేదనకు గురై తానూ ఆత్మహత్య చేసుకుందన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఘటనపై కనకపుర పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
వడదెబ్బకు
చిరు వ్యాపారి మృతి
దొడ్డబళ్లాపురం: వడదెబ్బకు చిరు వ్యాపారి మృతి చెందిన ఘటన బెళగావి జిల్లా కాగవాడ తాలూకా ఉగారఖుర్ద పట్టణంలో శుక్రవారం జరిగింది. వర్ధమాన్ అనే వ్యాపారి వారపు సంతలో వ్యాపారం చేస్తుండగా ఎండ తీవ్రత తట్టుకోలేక కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా వడదెబ్బకు మృతిచెందినట్టు వైద్యులు తేల్చారు. కాగవాడ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
బన్నేర్‌ఘట్ట జూ పార్కులో జిరాఫీ మృతి
బొమ్మనహళ్లి: బన్నేరుఘట్ట బయోలాజికల్ పార్క్‌లో ’శివాని’ అనే ఆడ జిరాఫీ మృతి చెందింది. మూడు సంవత్సరాల పది నెలల వయసున్న ఈ జిరాఫీ కొన్ని రోజులుగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. వారం రోజులుగా పశువైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే చికిత్స ఫలించక గురువారం సాయంత్రం మరణించినట్లు అధికారులు తెలిపారు. ‘సీకల్ టార్షన్‘ అనే సమస్యతో ఇది బాధపడుతున్నట్లు తెలిపారు. పేగులు మెలిపడటం, రక్త ప్రసరణ సరిగా లేకపోవడంతో ఇది మరణించినట్లు వైద్యులు తెలిపారు. పోస్ట్‌మార్టం పరీక్ష అనంతరం అంతర్గత అవయవాల నమూనాలను తదుపరి పరీక్షల కోసం హెబ్బాల్‌లోని ప్రయోగశాలకు పంపినట్లు తెలిసింది. శివానిని 2024 ఫిబ్రవరిలో మైసూరులోని చామరాజేంద్ర జూ నుంచి బన్నేరుఘట్ట బయోలాజికల్ పార్కుకు తీసుకువచ్చారు. జిరాఫీ మృతితో జంతు ప్రేమికులలో విషాదం నెలకొంది.


