బనశంకరి: సుప్రీంకోర్టు సూచన మేరకు గ్రేటర్ బెంగళూరు ప్రాధికార(జీబీఏ) పరిధిలోని ఐదు నగర పాలికెలకు జూన్ 14 నుంచి 24లోగా ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి కాగా ఈ అవధిలో పోలింగ్ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జీఏ.సంగ్రేశి తెలిపారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఐదు నగర పాలికెల కమిషనర్లు, అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్నికల తేదీ ప్రకటన మాత్రమే మిగిలి ఉందని, తేదీ కూడా ఒక వారంలోగా నిర్ణయిస్తామన్నారు. జీబీఏ ఆధ్వర్యంలో ఎన్నికలు కొద్దిగా వాయిదా వేయాలని మనవి అందినప్పటికీ జూన్ 30లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేసే ప్రసక్తే లేదన్నారు. జూన్ 24లోగా ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నప్పటికీ వాటిని త్వరగా పూర్తి చేయాలని సూచించామన్నారు. ఏ తేదీన పోలింగ్ నిర్వహించాలి అనే విషయంపై త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. జీబీఏ ఏ సమస్య తెలిపినప్పటికీ నిర్ణీత అవధిలోగా ఎన్నికలు నిర్వహించడం అనివార్యమన్నారు.
ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
అనంతరం జీబీఏ కమిషనర్ మహేశ్వర్‌రావ్ మాట్లాడుతూ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇప్పటికే వార్డుల విభజన, రిజర్వేషన్, ఓటర్ల తుదిజాబితా సిద్ధమైందన్నారు.
జూన్ 14 నుంచి 24 లోగా ఎన్నికలు
వారంలో పోలింగ్ తేదీని ప్రకటిస్తాం
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సంగ్రేశి


