లక్ష్య సాధనకు శ్రమించండి | - | Sakshi
Sakshi News home page

లక్ష్య సాధనకు శ్రమించండి

May 9 2026 7:50 AM | Updated on May 9 2026 7:50 AM

రాయచూరు రూరల్‌: విద్యార్థుల కష్టానికి ఫలితం దక్కిందని తహసీల్దార్‌ సురేష్‌ వర్మ అన్నారు. విద్యా రంగంలో రాయచూరు జిల్లా వెనుకబడిందనే ముద్రను చెరిపేందుకు కృషి చేశారని కొనియాడారు. శుక్రవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో విద్యాశాఖ, భారత జ్ఞాన విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో జరిగిన పదో తరగతి ఉత్తీర్ణత, భవిష్యత్తు ప్రణాళిక అనే అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. సమాజంలో ప్రతి ఒక్కరూ లక్ష్య సాధనకు శ్రమించాలని తెలిపారు. విద్యార్థులు పది తరువాత ఎలాంటి కోర్సులు తీసుకోవాలి, ఉద్యోగ అవకాశాలు తదితర వాటిపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టీపీఈఓ చంద్రశేఖర్‌, బీఈఓ ఈరణ్ణ కోస్గి, హపీజుల్లా మోయిన్‌ హుల్‌ హక్‌, రమేష్‌, అమరే గౌడ, ప్రశాంత్‌, యూనిస్‌ తదితరులు పాల్గొన్నారు.

అందరి సహకారంతో జిల్లాభివృద్ధి

రాయచూరు రూరల్‌: అందరి సహకారంతో జిల్లాభివృద్ధి సాధ్యం అని నూతన జిల్లా అధికారి పూవిత తెలిపారు. గురువారం సాయంత్రం జిల్లా పంచాయతీ కార్యాలయంలో జిల్లా అధికారి నితీష్‌కు వీడ్కోలు పలికి సన్మానించారు. ఈ సందర్భంగా నూతన జిల్లా అధికారి పూవిత మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను తెలుసుకోవడం అధికారుల బాధ్యత అన్నారు. సమర్థవంతంగా పని చేయడానికి సిద్ధమని వెల్లడించారు. జిల్లా అధికారి నితీష్‌ ప్రసంగిస్తూ.. రాయచూరు జిల్లాలో విధులు నిర్వహిస్తే దేశంలో ఎక్కడైనా పని చేయవచ్చని తెలిపారు. ఎయిర్‌పోర్టు, జాతీయ రహదారి, ఇతర పనులకు ఇచ్చిన సహకారం భవిష్యత్తులో నూతన అధికారికి ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ఈశ్వర్‌ కుమార్‌ చందూ, ఎస్పీ అరుణాంగ్శు గిరి, అదనపు జిల్లా అధికారి శివానంద, ఏసీ హంపణ్ణ, డీహెచ్‌ఓ సురేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.

లోకాయుక్త దాడులు

హుబ్లీ: ఈ–స్వత్తు, ల్యాండ్‌ రికార్డుల బదిలీ తదితర రికార్డులను తయారు చేసి ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారన్న ఫిర్యాదులు రావడంతో లోకాయుక్త అధికారులు శుక్రవారం ఉదయం హుబ్లీ–ధార్వాడ కార్పొరేషన్‌ డివిజన్‌ కార్యాలయాలపై దాడి చేశారు. లోకాయుక్త జిల్లా ఎస్పీ సిద్దలింగప్ప ఎస్‌టీ నేతృత్వంలో పాలికె పరిధిలో 12 డివిజన్‌ కార్యాలయాలు ఉండగా.. ఏకకాలంలో దాడి చేసి రికార్డులు పరిశీలించారు. ఈ–స్వత్తు ఆరోపణలపై విచారిస్తున్నారు. లంచం ఇస్తే కాని అధికారులు పనులు చేయడం లేదని.. అనవసరంగా సాకులు చూపి జాప్యం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఆరోపణల ఆధారంగా అధికారులు రికార్డులను క్షణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

మైనర్‌పై గ్రూప్‌–డి ఉద్యోగి లైంగిక దాడి

హొసపేటె: స్థానిక సబ్‌ డివిజన్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ గ్రూప్‌–డి ఉద్యోగి.. మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడిన ఆరోపణలపై నగరంలోని ఎక్సటెన్షన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాలు.. హొసపేటె సబ్‌ డివిజన్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో అజయ్‌ అనే వ్యక్తి గ్రూప్‌–డి ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఓ 16 ఏళ్ల బాలిక తన తల్లిని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకువచ్చినప్పుడు అజయ్‌ ఆ బాలికతో మాటలు కలిపాడు. మాయమాటలు చెప్పి ఆస్పత్రి ప్రాంగణంలోని తన నివాసానికి తీసుకెళ్లాడు. అనంతరం బాలికకు ఇచ్చిన జ్యూస్‌లో మత్తు మందు కలిపి లైంగికంగా వేధించాడు. ఈ విషయమై కేసు నమోదు చేసిన బరంగామ్‌ పోలీసులు.. నిందితుడు అజయ్‌ను అరెస్టు చేసి జ్యుడిషియల్‌ కస్టడీకి పంపారు.

కార్మికుడు ఆత్మహత్య

హోసూరు: కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన బిహార్‌ కార్మికుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల మేరకు.. బిహార్‌ రాష్ట్రానికి చెందిన మిదిలేష్‌ మండల్‌ (43) కుటుంబంతో కలిసి బాగలూరు సమీపంలోని చొక్కనాథపురం గ్రామంలో నివాసముంటూ కూలి పనులు చేస్తున్నాడు. కుటుంబ కలహాలతో గురువారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకొన్నాడు. నెల్లూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement