బనశంకరి: బెంగళూరు దక్షిణ నగర పాలికె పరిధిలోని సారక్కి చెరువు స్థలంలో భారీ ఆక్రమణలు జరిగినట్లు రెవెన్యూ శాఖ ఇటీవల నిర్వహించిన సమీక్ష నివేదికలో వెల్లడైంది. సారక్కి చెరువు పరిధిలో మొత్తం 58 ఆక్రమణలు వెలుగుచూడగా బఫర్ జోన్‌లో అనధికారిక కట్టడాలు నిర్మించారు. దక్షిణ నగర పాలికె, భూరికార్డుల అసిస్టెంట్ డైరెక్టర్ నేతృత్వంలో నిర్వహించిన సర్వేలో ఇళ్లు, వాణిజ్య కట్టడాలు, ఒక దేవస్థానంతో పాటు అనేక ఆక్రమణలు గుర్తించారు. ఆక్రమణ ఆస్తులపై మార్కింగ్ వేసి చెరువు సరిహద్దులను గుర్తించారు. బలమురి ప్రసన్న మహాగణపతి దేవస్థానంలో ఒక భాగం ఆక్రమణకు గురైందని అధికారులు తెలిపారు. ఈ నివేదికను హైకోర్టుకు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఆక్రమణలు తొలగించే అవకాశం ఉంది. జీబీఏ చెరువు అభివృద్ధి శాఖ అధికారులతో ఇటీవల సమావేశం నిర్వహించారు. రెవెన్యూ శాఖ అంతిమ నివేదిక అందిన అనంతరం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.


