ఎస్‌ఐపై అట్రాసిటీ కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐపై అట్రాసిటీ కేసు నమోదు

May 9 2026 7:50 AM | Updated on May 9 2026 7:50 AM

రాయచూరు రూరల్‌: యాదగిరి జిల్లాలో ఇంటెలిజెన్స్‌లో ఎస్‌ఐగా పని చేస్తున్న వీరేశ్‌పై సదర్‌ బజార్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఎస్‌ఐ వీరేశ్‌ తనపై కొప్పళలో అత్యాచారం చేసి వేధించాడని మహిళా కానిస్టేబుల్‌ విజయశ్రీ ఫిర్యాదు చేసింది. రెండుసార్లు అబార్షన్‌ కూడా చేయించినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. తనను కులం పేరుతో దూషించాడని పోలీసులకు తెలియజేసింది. అయితే ప్రేమ పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి, ఇప్పుడు మరొకరితో పెళ్లికి సిద్ధమైందని ఎస్‌ఐ వీరేశ్‌ ఆరోపిస్తున్నారు. తాను ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి ఇప్పించాలని కోరుతూ ఇప్పటికే రాయచూరు ఎస్పీ అరుణాంగ్శు గిరికి ఫిర్యాదు చేశారు. తాజాగా ఎస్‌ఐ వీరేశ్‌.. తనపై అత్యాచారం చేశారంటూ మహిళా కానిస్టేబుల్‌ విజయశ్రీ ఫిర్యాదు చేయడంతో కలకలం రేగింది. జిల్లా పోలీసు వర్గాల్లో ఈ వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది.

నిరంతరాయంగా

మజ్జిగ పంపిణీ

బళ్లారి అర్బన్‌: ఎండల తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా నిలిచేందుకు గీతా సేవి సంస్కార, వెల్ఫేర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉచిత శుద్ధ జల చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవళె, జడెప్ప మాట్లాడుతూ.. సేవయే పరమ ధర్మం అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మే 25వ తేదీ వరకు రోజూ నిరంతరాయంగా శుద్ధ జల, మజ్జిగ పంపిణీ కొనసాగుతుందన్నారు. తొలి రోజు సుమారు 250 మందికి పైగా ప్రజలు చల్లని మజ్జిగను సేవించి దాహాన్ని తీర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఎండ తీవ్రతను బట్టి మరిన్ని ప్రాంతాల్లో మజ్జిగ పంపిణీ చేపట్టాలని ట్రస్ట్‌ నిర్ణయించిందని తెలిపారు.

చిన్నారి ఆచూకీ లభ్యం

యశవంతపుర: చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా కెళగూరు గ్రామంలో కాఫీతోటలలో అదృశ్యమైన ఏడాదన్నర చిన్నారి అచూకీ లభించింది. రాత్రి కురుస్తున్న వానలో కాఫీచెట్ల కింద చిన్నారి చలిలో వణుకుతుండగా పోలీసులు రక్షించి తల్లీదండ్రులకు అప్పగించారు. మధ్యప్రదేశ్‌ నుంచి గోను, సోను దంపతులు పొట్టకూటి కోసం వలసవచ్చారు. ఐదు మంది పిల్లలను చూసుకోవటానికి ఒక మహిళను నియమించి పనులకు వెళ్లారు. ఓ చిన్నారి ఏడవటంతో కాపలా ఉన్న మహిళ మరికొందరు చిన్నారులను తోడుగా ఇచ్చి కాఫీతోటలోకి పంపింది. ఆ చిన్నారులు అక్కడే నిద్రపోయారు. శివం అనే చిన్నారిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వగా 12 గంటల పాటు గాలించారు. కాఫీతోట చివరి భాగంలో చిన్నారి నిద్రిస్తుండగా శుక్రవారం మధ్యాహ్నం చిన్నారిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.

రెండు రోజుల పాటు వానలు

యశవంతపుర: మండుతున్న ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వాతావారణశాఖ మంచి వార్తనిచ్చింది. వచ్చే రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల పరిధిలో వానలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఒళనాడు జిల్లాల్ల భారీగా రుములు–మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తర ఒళనాడు ధారవాడ, హవేరి, గదగ్‌, దక్షణ ఒళనాడు చిక్కమగళూరు, మైసూరు, కొడగు, మలెనాడు శివమొగ్గ, చిక్కమగళూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కరావళి కర్ణాటక దక్షిణకన్నడ, ఉడుపి, ఉత్తరకన్నడ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement