అడుగంటిన తుంగభద్ర | - | Sakshi
Sakshi News home page

అడుగంటిన తుంగభద్ర

May 9 2026 7:50 AM | Updated on May 9 2026 7:50 AM

హొసపేటె: కళ్యాణ కర్ణాటకలోని కొన్ని జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు జీవనాడి అయిన తుంగభద్ర డ్యాంలో నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. మొత్తం 105 టీఎంసీల గరిష్ట నీటిమట్టానికి గాను ప్రస్తుత నీటిమట్టం కేవలం 10 టీఎంసీల డెడ్‌ స్టోరేజీ స్థాయికి చేరుకుంది. దీంతో బళ్లారి, విజయనగర, కొప్పళ, రాయచూరు జిల్లాల్లో తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఏర్పడుతుందనే భయాందోళనలు ప్రజల్లో పెరిగాయి. తుంగభద్ర జలాశయంలో నీటిమట్టం గణనీయంగా తగ్గడంతో రాబోయే వర్షాకాలం వరకు అందుబాటులో ఉన్న కొద్ది పాటి నీటిని జాగ్రత్తగా కేటాయించడం తుంగభద్ర బోర్డుకు పెద్ద సవాలుగా మారింది. ప్రస్తుతం ఈ నాలుగు జిల్లాల్లోని ప్రధాన చెరువులను కాలువల ద్వారా నీటిని మళ్లించి నింపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే మే నెలలో వేసవి కాలంలో అధిక ఎండల కారణంగా జూన్‌లో వర్షాకాలం వచ్చే వరకు తాగునీటి సరఫరాను నిరంతరాయంగా కొనసాగించడం అధికారులకు కష్టంగా మారుతోంది.

కొత్త క్రస్ట్‌గేట్ల అమరిక పనులు పూర్తి

మరోవైపు జలాశయం భద్రత కోసం చేపట్టిన ఒక ముఖ్యమైన సాంకేతిక కార్యాచరణ విజయవంతంగా పూర్తయింది. జలాశయానికి చెందిన 33 కొత్త క్రస్ట్‌గేట్ల అమరిక పనులు సుమారు రూ.54 కోట్ల వ్యయంతో పూర్తయ్యాయి. ఇక రాబోయే 50 ఏళ్ల పాటు ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా క్రస్ట్‌గేట్లు పని చేస్తాయని నిపుణులు హామీ ఇచ్చారు. కొత్తగా అమర్చిన ఈ గేట్లను ఉపముఖ్యమంత్రి డీకే.శివకుమార్‌ ఈనెల 15న డ్యాం వద్ద ప్రత్యేక పూజలు చేయడం ద్వారా లాంఛనంగా ప్రారంభిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.

డ్యాంలో గణనీయంగా తగ్గిన నీటిమట్టం

ప్రస్తుత నీటి నిల్వ కేవలం 10 టీఎంసీలే

ప్రజల్లో తాగునీటి ఎద్దడి భయాందోళన

Advertisement
 
Advertisement
Advertisement