హొసపేటె: జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ప్రజలకు నిరంతరాయంగా నీరు సరఫరా చేయాలని జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (జెడ్పీ సీఈఓ) నోంగ్‌జోయ్ మహమ్మద్ అలీ అక్రమ్ షా తెలిపారు. శుక్రవారం విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకాలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 153 గ్రామాల్లో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని గుర్తించారు. హరపనహళ్లి తాలూకాలో 24, హగరిబొమ్మనహళ్లిలో 5, హడగలి తాలూకాలో 3 గ్రామాలతో సహా మొత్తం 32 గ్రామాల్లో ఇప్పటికే నీటి సమస్య ఉందని వెల్లడించారు. గ్రామాలకు నీటిని సరఫరా చేయడానికి 41 ప్రైవేట్ బోర్‌వెల్స్‌ను అద్దెకు తీసుకున్నట్లు పేర్కొన్నారు. అవసరమైతే గ్రామీణ తాగునీటి, పారిశుధ్య శాఖకు చెందిన 4 నీటి ట్యాంకర్లను కూడా ఉపయోగించవచ్చని సూచించారు. జిల్లాలోని 666 శుభ్రమైన తాగునీటి యూనిట్లను నిరంతరం పరిశీలించాలన్నారు. ఏదైనా సాంకేతిక లోపం కనబడితే వెంటనే మరమ్మతులు చేయాలని తెలిపారు. నీటి సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించడానికి, తక్షణ పరిష్కారం కోసం జిల్లా తాలూకా స్థాయిల్లో 24 గీ7 కంట్రోల్ రూమ్ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారు. తాగునీటి సమస్యపై 9480837823 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.
జెడ్పీ సీఈఓ
నోంగ్‌జోయ్ మహమ్మద్ అలీ అక్రమ్ షా


