హొసపేటె: ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన హంపీలో పర్యాటకులు, స్థానికులకు ఒకే చోట వివిధ రకాల నాణ్యమైన ఆహార పదార్థాలను అందించేందుకు పీఎం స్వనిధి పథకం కింద అత్యాధునిక స్ట్రీట్‌ఫుడ్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ కవితా ఎస్.మన్నికేరి వెల్లడించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారులతో మాట్లాడారు. హంపీకి వచ్చే వేలాది మంది దేశీయ, విదేశీ పర్యాటకులకు ఒకే చోట పరిశుభ్రమైన, వైవిధ్యమైన ఆహారాన్ని అందించడమే ఈ ఫుడ్ హబ్ యొక్క ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇది స్థానిక వీధి వ్యాపారులకు ఆర్థిక సాధికారత కల్పించి, హంపీ పర్యాటక రంగానికి కొత్త రూపు తీసుకొస్తుందన్నారు. చాముండి హిల్స్, బేలూరు–హలేబిడు, గంగాపూర్, పట్టడకల్లు, హంపీతో సహా రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో స్ట్రీట్‌ఫుడ్ హబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఇందులో మన హంపీ కూడా చేర్చబడటం గర్వకారణమని తెలిపారు. ఈ స్ట్రీట్ ఫుడ్‌హబ్ ఏర్పాటు చేయడానికి రూ.4 కోట్ల వ్యయంతో ఒక తాత్కాలిక దుకాణాన్ని ఏర్పాటు చేసి వ్యాపారం నడపడానికి ఒక క్లస్టర్‌కు అనుమతి ఇవ్వబడుతుందన్నారు. పెద్ద మర్రిచెట్టుకు ఎదురుగా, హంపీ పార్కింగ్ స్థలానికి సమీపంలో ఉన్న గుత్తిలాండ్‌తో సహా రెండు ప్రదేశాలను ఇప్పటికే గుర్తించి, భూ కేటాయింపు కోసం ప్రతిపాదన సమర్పించామన్నారు. కార్యక్రమంలో జిల్లా పట్టణాభివృద్ధి ప్రాజెక్ట్ డైరెక్టర్ మనోహర్, హంపీ అభివృద్ధి అథారిటీ కమిషనర్ రమేష్, జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖ జిల్లా ప్రచార నిర్వాహకుడు దేవరాజ్ పాల్గొన్నారు.


