హొసపేటె: ప్రైవేట్ పాఠశాలల్లో డొనేషన్లు అరికట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. విరాళాలను నియంత్రించడానికి తక్షణమే జిల్లా విద్యా నియంత్రణ అథారిటీని ఏర్పాటు చేయాలని కోరారు. విరాళాలు సేకరించే విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా, తాలూకా స్థాయిలో విద్యా సంస్థల అధిపతులు, విద్యాశాఖ అధిపతులు, తల్లిదండ్రులు, విద్యార్థులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలి. ప్రైవేట్ విద్యా సంస్థలను నియంత్రించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కల్పించే కేంద్ర చట్టాన్ని అమలు చేయాలని తెలిపారు. ప్రభుత్వం నిర్ధారించిన ప్రవేశ రుసుముల వివరాలను నోటీస్ బోర్డుల్లో ప్రదర్శించాలన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ప్రతి నెలా తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. నిబంధనలకు మించి విరాళాలు స్వీకరించిన ప్రైవేట్ విద్యాసంస్థలకు విద్యా హక్కు చట్టం ప్రకారం జరిమానా విధించాలని పేర్కొన్నారు. అనధికారిక ట్యూషన్ సెంటర్లను మూసి వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు శారద, పవన్ కుమార్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


