బొమ్మనహళ్లి: ఆనేకల్ తాలూకా చిక్కహోసహాసహళ్లిలో శ్రీమహదేశ్వర జాతర వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామి దర్శనం కోసం ఉదయం నుంచే వందలాది భక్తులు ఆలయం వద్ద బారులు తీరారు. జాతర సందర్భంగా వీధుల్లో ఊరేగింపు, నిప్పుల గుండంలో నడక నిర్వహించారు. అర్చకులు, భక్తులు భగభగమంటున్న నిప్పుల గుండంలో నడిచి భక్తిని చాటుకున్నారు, వందలాది మంది ఈ వేడుకను వీక్షించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. కాశీ విశ్వనాథ్‌తో సహా పలు ఆలయాల్లో ప్రత్యేక అలంకరణలు చేశారు.
సీఎం కుర్చీ తగాదాను
పరిష్కరించాలి: రాజణ్ణ
మైసూరు: రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పుపై ఉన్న గందరగోళాన్ని కాంగ్రెస్ హైకమాండ్ వెంటనే పరిష్కరించాలని, అప్పుడే ప్రభుత్వానికి, పార్టీకి మంచిదని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేఎన్ రాజణ్ణ అన్నారు. ఆయన గురువారం నగరంలోని టీకే లేఔట్‌లోని సీఎం సిద్దరామయ్య నివాసం వద్ద విలేకరులతో మాట్లాడారు. సీఎం సిద్దరామయ్య ఇప్పటికే తాను హైకమాండ్ ఎలా చెబితే అలా నడుచుకుంటానని చెప్పారు, అందువల్ల హైకమాండ్ రాష్ట్రంలోని నాయకత్వ మార్పు గందరగోళాన్ని సత్వరం పరిష్కరించాలన్నారు. లేకుంటే ప్రభుత్వం, పార్టీపై దుష్పరిణామాలు చూపుతుందన్నారు. గందరగోళాన్నే కొనసాగిస్తే అది అన్ని రకాల సమస్యలకు మూలం అవుతుందన్నారు. డీసీఎం డీకే శివకుమార్ తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అందువల్ల సీఎం కుర్చీపై ఆశ ఎక్కువగానే ఉంటుందన్నారు. అది తప్పు కూడా కాదన్నారు. కాంగ్రెస్‌లో డజను మందికి సీఎం పదవికి అర్హత ఉందని అన్నారు.
హైకోర్టులో జీవరాజ్‌కు ఊరట
శివాజీనగర: శృంగేరి అసెంబ్లీ నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్ పత్రాలను మార్చేశారంటూ దాఖలైన పిటిషన్‌ల విచారణ మీద హైకోర్టు జూన్ 3 వరకు స్టే జారీ చేసింది. ఇటీవల పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి జీవరాజ్ గెలవడం తెలిసిందే. ఇందులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకుడు సుధీర్‌కుమార్ మురుళ్లి కేసు వేశారు. న్యాయమూర్తి జస్టిస్ వీ.శ్రీశానంద విచారణ జరిపారు. అవతలి పక్షం అభ్యంతరాలు ఉంటే దాఖలు చేయాలని ఆదేశిస్తూ, ఈ కేసులపై స్టేని విధిస్తూ జూన్ 3కు వాయిదా వేశారు. దీంతో జీవరాజ్‌కు ఉపశమనం దక్కినట్లయింది.
కమనీయంగా కరగ
బొమ్మనహళ్లి: బెంగళూరు వద్ద ఆనేకల్ తాలూకాలోని ఇండ్లవాడి జీపీ చిక్కహోసహళ్లిలో మహాదేశ్వర స్వామి జాతర సందర్భంగా కరగ మహోత్సవం కనులపండువగా జరిగింది. మారెమ్మ ఆలయం నుంచి కరగను ఎత్తుకుని ఊరేగింపు బయటకు రాగానే, భక్తులు మల్లెపూలు కురిపించి స్వాగతం పలికారు. డప్పులు, మంగళ వాయిద్యాల లయకు అనుగుణంగా కరగధారి నృత్యాలు చేస్తూ ముందుకు కదిలారు. జాతరలో భాగంగా గ్రామదేవతల పల్లకీ ఉత్సవం నిర్వహించారు. గ్రామంలోని మహదేశ్వర స్వామి, ముత్తరాయ స్వామి, కాశీ విశ్వనాథ స్వామి, మునేశ్వర స్వామి, గంగమ్మ దేవి, సత్తెమ్మ దేవి, సపలమ్మ దేవి, కడిగేరమ్మ దేవీల పల్లకీ ఉత్సవాలు ఆకట్టుకున్నాయి. రాత్రి జరిగిన మారెమ్మ దేవి పూజ నాట్య ప్రదర్శన భక్తులను ముగ్ధులను చేసింది.
ప్రేమ గొడవ..
బాలుడు ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: 26 ఏళ్ల యువతితో ప్రేమలో పడిన 15 ఏళ్ల బాలుడు పెద్దలు మందలించడంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన చెన్నపట్టణలోని రాజా కెంపేగౌడ కాలనీలో జరిగింది. పసి వయసులో దారి తప్పి జీవితాన్ని అంతం చేసుకున్నాడు. బిడదికి చెందిన బాలుడు స్థానిక యువతితో పరిచయం పెరిగి ప్రేమలో పడ్డాడు. ఇది పెద్దలకు తెలిసి ఇలా చేయరాదని అతన్ని మందలించారు. యువతి చెన్నపట్టణకు వెళ్లిపోయింది. 2వ తేదీన అక్కడకు వెళ్లిన బాలుడు ఆమెతో గొడవపడి పురుగుల మందును తాగాడు. బాలున్ని ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స ఫలించక మృతిచెందాడు. తమ కుమారుని మృతికి యువతి కారణమని తల్లిదండ్రులు చెన్నపట్టణ గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


