పెచ్చరిల్లిన ప్రతీకారం | - | Sakshi
Sakshi News home page

పెచ్చరిల్లిన ప్రతీకారం

May 8 2026 1:25 PM | Updated on May 8 2026 1:25 PM

మైసూరు: ఆస్తి కోసం సోదరులను మచ్చుకత్తితో సవతి సోదరుడు నరికి దారుణంగా హత్య చేసిన ఘటన జిల్లాలోని కేఆర్‌నగర తాలూకా అర్జునహళ్లి గ్రామంలో జరిగింది. డిస్కవరి రఘు (35), హర్షవర్ధన్‌ (30) హతులు. వీరు మండ్య జిల్లా శ్రీరంగపట్టణలో నివాసం ఉన్నారు. అర్జునహళ్లి గ్రామంలో ఈ ఘోరం జరిగింది.

ఇద్దరు భార్యలు.. ఆస్తి గొడవలు

రైతు రమేష్‌ రాజుకు ఇద్దరు భార్యలు కాగా చిన్న భార్య కుమారుడు డిస్కవరి రఘు, ఆస్తి కోసం తండ్రి రమేష్‌ రాజును మూడేళ్ల క్రితం చంపేసి జైలుకెళ్లి వచ్చాడు. చిన్న భార్య కామాక్షి శ్రీరంగపట్టణ లో టీచర్‌గా పని చేస్తుండేవారు. మూడేళ్ల క్రితం కామాక్షి రిటైరైన తర్వాత పిల్లలు డిస్కవరీ రఘు, హర్షవర్ధన్‌లతో కలిసి శ్రీరంగపట్టణలో నివాసం ఉన్నారు. రమేష్‌రాజు మొదటి భార్య సుధ కొడుకు రోహిత్‌ (28), కాగా, సవతి సోదరులతో గొడవలున్నాయి. ఆస్తి పంచాయతీ చేసుకుందామని రోహిత్‌.. రఘు, హర్షవర్ధన్‌లను అర్జునహళ్లి గ్రామానికి పిలిపించాడు. ఈ సమయంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన రోహిత్‌ మచ్చుకత్తిని తీసుకుని సోదరుల తల, ముఖంపై నరికాడు, హర్షవర్ధన్‌ అక్కడే మరణించగా, తప్పించుకుని పారిపోతున్న డిస్కవరీ రఘును వెంబడించి కళ్యాణపుర వద్ద రోడ్డు పక్కన హతమార్చాడు.

నిందితుడు అరెస్టు

కేఆర్‌నగర ఇన్‌స్పెక్టర్‌ శివప్రకాష్‌, పోలీసులు స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడు రోహిత్‌ను పొలం వద్ద ఉండగా అరెస్టు చేశారు. స్వల్ప గాయాలైన అతనికి కేఆర్‌నగర ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించి అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యాకాండను చూసిన గ్రామస్తులు భయాందోళనకు లోనయ్యారు.

ఇద్దరు దాయాదుల నరికివేత

ఆస్తి గొడవలతో సవతి సోదరుని కిరాతకం..

మైసూరు జిల్లాలో కలకలం

Advertisement
 
Advertisement
Advertisement