బొమ్మనహళ్లి: ఏపీకి చెందిన చిత్తప్పగారి ఆనంద్ (34), షేక్ షఫీర్ బాషా (37) కన్నుపడితే ఎలాంటి బైక్ అయినా మాయమవుతుంది. నకిలీ తాళాలతో ఎత్తుకెళ్తారు. తరువాత దానికి ఏజెంట్ల సహాయంతో ఆర్‌సీ కార్డును సృష్టించి అమ్మేయడం, ఆ డబ్బుతో జల్సాగా జీవించడం వారి నైజం. గత కొన్నేళ్లుగా బైక్ చోరీల్లో ఆరితేరారు. నాలుగురోజుల కిందట బెంగళూరు హెబ్బగోడి పోలీసులు ఈ ఘరానా దొంగలను అరెస్టు చేయడం తెలిసిందే. తాజాగా వారి చిత్రాలు, బైక్‌ల ఫోటోలను విడుదల చేశారు. ఓ షోరూంకు సరిపడే బైక్‌లను ఈ దుండగులు కొల్లగొట్టారు, ఫలితంగా ఎంతోమంది జీవనాధారమైన బైక్ పోయిందని బాధపడడంతో పాటు డబ్బును నష్టపోయారు. దొంగల నుంచి రూ 41.67 లక్షల విలువైన 51 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షఫీర్ బాషా నకిలీ ఆర్‌సీలను తయారు చేయడంలో దిట్ట అని తెలిసింది. కంప్యూటర్, ప్రింటర్, మొబైల్‌ఫోన్లు, 501 ఆర్‌సి కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ కమిషనర్ నారాయణ్, ఏసీపీ సతీష్ కేసును పర్యవేక్షించారు. నగరంలో ఎవరిదైనా బైక్ పోయి ఉంటే హెబ్బగోడి ఠాణాలో సంప్రదించవచ్చు.
ఇద్దరు ఘరానా దొంగల
నుంచి 51 బైక్‌లు సీజ్


