లేఔట్లపై అభ్యంతరాలకు 15 రోజుల గడువు | - | Sakshi
Sakshi News home page

లేఔట్లపై అభ్యంతరాలకు 15 రోజుల గడువు

May 8 2026 1:25 PM | Updated on May 8 2026 1:25 PM

రాయచూరు రూరల్‌: నగరంలో 27 లేఔట్లపై అభ్యంతరాల వెల్లడికి 15 రోజుల గడువు విధించినట్లు రాయచూరు నగరాభివృద్ధి ప్రాధికార అధ్యక్షుడు రాజశేఖర్‌ రామస్వామి పేర్కొన్నారు. గురువారం నగరాభివృద్ధి ప్రాధికార కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకోవాలని నోటీసులు జారీ చేశామన్నారు. నగరంలో రూ.75 లక్షలతో నూతన అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. నగరసభ మొత్తం బడ్జెట్‌ రూ.75.89 లక్షలు కాగా రూ.70.14 కోట్లు వ్యయం కాగా రూ.5.75 లక్షలు మిగులు బడ్జెట్‌గా పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ వసంత్‌ కుమార్‌, సభ్యులు రామస్వామి, ప్రతిభా రెడ్డి, దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.

మఠం అభివృద్ధికి ప్రాధాన్యత

రాయచూరు రూరల్‌: నగరంలో సోమవారపేట హిరేమఠం అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించాలని మాజీ శాసన సభ్యుడు పాపారెడ్డి పేర్కొన్నారు. గురువారం సోమవారపేట హిరేమఠంలో 25 శిలా మంటపాలకు భూమిపూజ చేసి ఆయన మాట్లాడారు. మఠం అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. సోమవారపేట హిరేమఠం పీఠాధిపతి అభినవ రాచోటి శివాచార్య, శాసన సభ్యుడు శివరాజ్‌ పాటిల్‌, దోతరబండి మల్లికార్జున, అంతరగంగి వీరభద్రప్ప, షణ్ముకప్ప, నాగనగౌడ, నాగరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తనీయొద్దు

రాయచూరు రూరల్‌: వేసవిలో రెండు నెలల పాటు జిల్లాలో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా చూడాలని జిల్లాధికారిణి పూవిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం జిల్లాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తుంగభద్ర, కృష్ణా నదీ ప్రాంతంలోని గ్రామాలకు నీటి సరఫరాలో జాప్యం నెలకొనకుండా చూడాలని సూచించారు. విద్యుత్‌ కోత, మోటార్లు చెడిపోవడం, ఇతరత్ర కారణాలు చెప్పకుండా నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, నీటి కుంటలను నింపాలని పీడీఓలకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపట్టాలన్నారు. పశువులకు గ్రాసం కొరత రాకుండా చూడాలన్నారు. సమావేశంలో ఏసీ హంపన్న, టీపీ ఈఓ చంద్రశేఖర్‌ పవార్‌, శరణ బసవ, సురేష్‌ వర్మ తదితరులున్నారు.

గృహలక్ష్మిపై అలసత్వం తగదు

రాయచూరు రూరల్‌: పంచ గ్యారంటీల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహలక్ష్మి పథకం డబ్బుల పంపిణీలో అధికారులు అలసత్వం వహించడం తగదని పంచ గ్యారంటీల అమలు సమితి అధ్యక్షుడు పామయ్య మురారి అధికారులపై మండిపడ్డారు. గురువారం జలనిర్మల కార్యాలయ సభాంగణంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యలను ఆలకించడం అధికారుల విధి అని, సమర్థవంతంగా పని చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. వారం రోజుల్లోపు గృహలక్ష్మి డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో పడేలా చూడాలన్నారు. ఈ విషయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్లు సమస్యలను పెద్దవి చేయకుండా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశాలకు శాఖల ప్రధాన అధికారులు హాజరు కావాలే తప్ప మిగిలిన సిబ్బంది కార్యాలయాల్లో విధులు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా యోజనాధికారి రోణ, సభ్యులు హన్మంతు, పవన్‌ పాటిల్‌, నాగేంద్రప్పలున్నారు.

నీటికుంటలో పడి మహిళ మృతి

కోలారు: ప్రమాదవశాత్తూ నీటి కుంటలో పడి మహిళ మృతి చెందిన ఘటన ముళబాగిలు పట్టణంలోని శివకేశవ నగరలో ఉన్న కొలిమికుంటలో చోటు చేసుకుంది. ముళబాగిలు పట్టణానికి చెందిన సౌభాగ్యమ్మ (65) మరణించిన మహిళ. మృతురాలికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఉదయం కొలిమి కుంటకు వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా కాలుజారి కుంటలో పడి మరణించింది. ముళబాగిలు నగర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement