ఖాళీ ఉద్యోగాల భర్తీ చేపట్టరూ | - | Sakshi
Sakshi News home page

ఖాళీ ఉద్యోగాల భర్తీ చేపట్టరూ

May 8 2026 1:25 PM | Updated on May 8 2026 1:25 PM

రాయచూరు రూరల్‌: ఖాళీగా ఉన్న 52,432 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టాలని నిరుద్యోగుల పోరాట సమితి డిమాండ్‌ చేసింది. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకులు చెన్నబసవ మాట్లాడారు. ఉద్యోగ నియామకాల్లో ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో ధార్వాడ, కలబుర్గి, బాగల్‌కోటెల్లో ఆందోళనలు చేయడంతో ప్రభుత్వం స్పందించి త్వరితగతిన నియామకాలకు మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికి ముందుకు రావాలని కోరుతూ జిల్లాధికారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు.

కొప్పళలో లవ్‌ జిహాద్‌

యువకుడిపై దాడి

8 మంది నిందితుల అరెస్ట్‌

సాక్షి, బళ్లారి: కొప్పళలో లవ్‌ జిహాద్‌ ఘటనలు ఆగడం లేదు. ఈనేపథ్యంలో కొప్పళలో ముస్లిం యువకుడు సమీర్‌పై 8 మంది హిందూ యువకులు దాడి చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్‌ చేశారు. కాగా ముస్లిం యువకుడి మొబైల్‌లో పలువురు హిందూ యువతులతో ఉన్న ఫోటోలు, వీడియోలు లభించాయని విశ్వ హిందూ పరిషత్‌ ప్రముఖులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కొప్పళ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని యువకుడిపై దాడి చేయడం సరికాదని సూచించారు.

జాతీయ స్థాయి కరాటే పోటీలకు ఎంపిక

బళ్లారిటౌన్‌: ట్రెడిషనల్‌ షూటోఖాన్‌ కరాటే అకాడమి, కర్ణాటక జిందాల్‌ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన కరాటే విద్యార్థులు జాతీయ స్థాయి కరాటే పోటీలకు ఎంపికై నట్లు కరాటే అకాడమి శిక్షకుడు కట్టెస్వామి తెలిపారు. ఈ నెల 16, 17 తేదీల్లో అసోంలోని గౌహతిలో జరగనున్న 24వ అఖిల భారత కరాటే పోటీల్లో పాల్గొనేందుకు 10 మంది బాలురు, ముగ్గురు బాలికలు ఎంపికయ్యారన్నారు. వీరితో పాటు నలుగురు శిక్షకులు కూడా పాల్గొంటున్నట్లు తెలిపారు. ఎంపికై న విద్యార్థులను కరాటే శిక్షకులు సుభాష్‌ చంద్ర, జడేష్‌ హులుగన్న, బీ.నాగరాజు, హనుమంత ప్రసాద్‌, నబీసాబ్‌, ఆనంద్‌, జిందాల్‌ అధికారులు అభినందించారు.

ప్రాచీన కళలపై

ప్రోత్సాహం అవసరం

బళ్లారి రూరల్‌: తోలుబొమ్మలాట, జానపద నాటకాలు తదితర ప్రాచీన కళలపై పిల్లలను ప్రోత్సహించాలని శ్రీధరగడ్డ జగద్గురు కొట్టూరు మఠం సంస్థానాధిపతి మరి కొట్టూరు తెలిపారు. బుధవారం శ్రీధరగడ్డ బసవేశ్వర ఆలయ ఆవరణలో ఎర్రిస్వామి తోలుబొమ్మల కళా ట్రస్టు, బళ్లారి కన్నడ సాహిత్య పరిషత్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కన్నడ సాహిత్య పరిషత్తు ఉత్తమ కార్యక్రమాలను చేపడుతూ గ్రామీణులకు ప్రాచీన కళలను గుర్తు చేస్తోందన్నారు. పాశ్చాత్య నాగరికతకు అటువాటు పడిన నేటి ప్రజలకు మన కళలపై ఆసక్తిని పెంపొందించాలన్నారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కన్నడ సాహిత్య పరిషత్‌ సహ సంచాలకుడు నాగరాజు మాట్లాడుతూ ప్రాచీన కళలు, వాటి విశిష్టతను గురించి వివరించారు. కార్యక్రమంలో శ్రీధరగడ్డ గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

టిప్పు సర్కిల్‌ అభివృద్ధికి వినతి

రాయచూరు రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం టిప్పుసుల్తాన్‌ సర్కిల్‌ను అభివృద్ధి పరచాలని ఎస్‌డీపీఐ డిమాండ్‌ చేసింది. గురువారం నగరసభ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకులు ఖాజా మోయినుద్దీన్‌ మాట్లాడారు. టిప్పుసుల్తాన్‌ సర్కిల్‌లో ఉద్యానవనం, విద్యుత్‌ దీీపాల అలంకరణ, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రికి నగరసభ కమిషనర్‌ ద్వారా వినతిపత్రం సమర్పించారు.

సేవాదళ్‌ పాత్ర అనన్యం

కోలారు: భారత సేవాదళ్‌ శిక్షణను ప్రతి పాఠశాలలోను తప్పనిసరి చేయాలని భారత సేవాదళ్‌ గౌరవ అధ్యక్షుడు సీఎంఆర్‌ శ్రీనాథ్‌ తెలిపారు. గురువారం నగరంలోని ఖాద్రిపురలోని శ్రీ నల్లూరమ్మ దేవి పిల్లల ఆశ్రమంలో హర్డీకర్‌ జయంతిని నిర్వహించారు. యువత దేశ ప్రేమ, దేశభక్తి, జాతీయ పతాకానికి గౌరవం ఇవ్వాలన్నారు. ఇందుకు భారత సేవాదళ్‌ శిక్షణ అవసరమన్నారు. కేఎస్‌ గణేష్‌, సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement