బళ్లారిటౌన్: అఖండ బళ్లారి జిల్లాలోని రైతుల జీవనాడి తుంగభద్ర డ్యాంలో పేరుకున్న పూడికను ప్రభుత్వం తొలగించాలని తుంగభద్ర రైతు సంఘం అధ్యక్షుడు పురుషోత్తంగౌడ డిమాండ్ చేశారు. గురువారం పత్రికా భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పూడిక వల్ల దాదాపు 30 టీఎంసీల నీటిని ప్రతి ఏటా కోల్పోతున్నామన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో చర్చించి తగిన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో మైనింగ్ నిధులు ఇతర అభివృద్ధి పనులకు వినియోగించే బదులు పూడికతీత పనులకు వినియోగిస్తే ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. గత 26 ఏళ్లుగా ఈ విషయాన్ని రైతు సంఘాల నేతలు ప్రభుత్వం దృష్టికి తెస్తున్నా ప్రభుత్వాలు సక్రమంగా స్పందించడం లేదన్నారు. 2017లో రైతు సంఘాల ఆధ్వర్యంలో డ్యాంలో పూడికతీతకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. ఆ ప్రయత్నాలు ప్రభుత్వాలు చేసినట్లయితే 10 ఏళ్లలో పూడికతీతను పూర్తి చేయవచ్చన్నారు. డ్యాంలో రైతులకు ఉపయోపడే ఒండ్రుమట్టి, ఇసుక, గ్రావెల్ ఉందని, దీన్ని ఉపయోగించుకోవచ్చన్నారు. రైతులు డ్యాంలోని మట్టిని పొలాలకు తీసుకెళుతుంటే పోలీసులు, మైన్స్ అండ్ జువాలజీ శాఖ అధికారులు వేధిస్తున్నారన్నారు. రైతులకు ఉపయోగపడే మట్టిపై కూడా అధికారులు అనవసరంగా ఆంక్షలు విధిస్తున్నారన్నారు. ఈ నెలాఖరులో రైతు సంఘం ఆధ్వర్యంలో డ్యాంలో పూడికతీతకు తామే శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన తెలిపారు. విలేకరుల సమావేశంలో రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనర్ ఉద్దెహాళు, ప్రముఖులు దొడ్డదానప్ప, రాజు గౌడ, వీరభద్రగౌడ, శ్రీధర్, దరూరు బసవరాజు, గోవిందప్ప తదితరులు పాల్గొన్నారు.


