చెళ్లకెరె రూరల్: చిత్రదుర్గ జిల్లా చెళ్లకెరె తాలూకా బొబ్రహళ్లి గ్రామానికి చెందిన 72 ఏళ్ల ఆదర్శ రైతుకు ఉత్తమ రైతు అవార్డు లభించింది. హైదరాబాద్ భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్) డైరెక్టర్ డాక్టర్.ఎంఎల్ జాట్ రైతును సన్మానించారు. రైతు చిక్కణ్ణ కుసుమగిరి ఎఫ్‌టీఓ ద్వారా లభించే హెర్‌ఆర్–13 రాగి విత్తనాలను సేంద్రియ వ్యవసాయ పద్ధతి ద్వారా సాగు చేసి ఉత్తమ ఫలితాలను సాధించాడు. ఐసీఏఆర్ విజ్ఞాని మార్గదర్శనంలో నాటి పద్ధతిలో సమతుల్య పోషకాంశాలు, నైసర్గిక వ్యవసాయ విధానాలను అనుసరించారు. ఈ పంటను రైతు ఉత్పాదన సంస్థ ద్వారా క్వింటాలుకు రూ.4,886 ల చొప్పున కొనుగోలు చేశారు. 6 ఎకరాల్లో సాగు చేసిన పంటతో రూ.6.59 లక్షల రాబడి లభించిందని అన్నారు. దీంతో పాటు తనకు ఉన్న 60 పశువులకు పశుగ్రాసం లభించినట్లయిందన్నారు. ఉత్తమ పంట దిగుబడికి సలహా సూచనలు అందించిన విజ్ఞానులు డాక్టర్ సీ.తారా సత్యవతి, డాక్టర్ కే.శ్రీనివాస బాబు, డాక్టర్ రఫీలకు రైతు కృతజ్ఞతలు తెలిపారు. కుసుమగిరి రైతు ఉత్పాదక సంస్థ సీఈఓ డాక్టర్ నరసింహమూర్తి అందించిన సహకారాన్ని కూడా రైతు ఈసందర్భంగా కొనియాడారు.


