హొసపేటె: భూ ఖాతా మార్పిడికి రూ.75 వేలు లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు కొప్పళ జిల్లా కోళూరు గ్రామ పంచాయతీ కార్యదర్శిని, బిల్ కలెక్టర్‌ను, రోజు వారీ కూలీని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిని కోళూరు జీపీ కార్యదర్శి మరియప్ప, బిల్ కలెక్టర్ నాగరాజ్, రోజువారీ కూలీ మారుతీగా గుర్తించారు. ఫిర్యాదుదారుడు ఎం.జ్ఞానేశ్వరయ్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దదేగల్ గ్రామ ఆర్ నెంబర్– 74/29 వద్ద ఉన్న 8 గుంటల భూమికి సంబంధించి భూ మార్పిడి, డిజైన్ ఆమోదం, అనంతరం పంచాయతీ ఖాతాను నమోదు చేయడానికి, ఫారం నెంబర్ 9–11 జారీ చేయడానికి నిందితులు రూ.75 వేలు లంచం డిమాండ్ చేశారు. అయితే లంచం ఇవ్వడానికి ఇష్టపడని ఫిర్యాదుదారుడు ఈనెల 5వ తేదీన లోకాయుక్త పోలీసులకు సమాచారం అందించారు. ఆ ప్రకారం బుధవారం పక్కా ప్రణాళికతో వల పన్ని నిందితులను అరెస్టు చేసినట్లు లోకాయుక్త అధికారులు తెలిపారు. లోకాయుక్త ఎస్పీ సీ.సిద్ధరాజు మార్గదర్శకత్వంలో, డీఎస్పీ లోకేష్ నేతృత్వంలో చేపట్టిన కార్యాచరణలో దర్యాప్తు అధికారి, పోలీసు ఇన్‌స్పెక్టర్ చంద్రప్ప, ఇన్‌స్పెక్టర్లు సునీల్, శైలా పాటిల్ పాల్గొన్నారు.
జీపీ కార్యదర్శి సహా ముగ్గురు అరెస్టు


