● కొట్టేసిన గొలుసు ముక్కను ఇచ్చేశారు
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం నగరంలోని చామరాజపేటలో మే 3వ తేదీ ఉదయం ప్రియా అనే మహిళ నీటి సంపును చూస్తుండగా పల్సర్ బైక్‌లో వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె గొంతును పట్టుకొని మాంగల్యం చైనును లాగారు. ఆమె చైన్‌ను గట్టిగా పట్టుకోగా, కొంత గొలుసును దుండగులు తెంచుకెళ్లారు. తరువాత చిక్కబళ్లాపురం నగర ఠాణాలో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘటనాస్థలి నుంచి దేవనహళ్లి వరకు ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. 5వ తేదీన ప్రియ భర్త ఇంటి బయట ఉన్న బాత్‌రూంలోకి వెళ్తుండగా మెట్లపైన గొలుసు ముక్క ఉండగా చూసి తీసుకున్నాడు. అది దుండగులు తెంచుకెళ్లిన గొలుసేనని గుర్తించారు. పోలీసులు ఇంటికి వచ్చి పరిశీలించి వెళ్లారు. దొంగలు భయపడి గొలుసును వదిలిపెట్టి ఉంటారని భావిస్తున్నారు. ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది.
అడవిలో చెట్టుకు బస్సు ఢీ
మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు పట్టణం నుంచి హోగ్యంకు వెళుతున్న కేఎస్ ఆర్టీసీ బస్సు అటవీ ప్రాంతంలో చెట్టును ఢీ కొట్టింది. బస్సులోని 39 మంది ప్రయాణికులు ఉండగా, ముందు భాగంలో కూర్చొన్న కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు స్టీరింగ్ లాక్ కావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. రోడ్డు అడ్డుగోడను ఢీ కొట్టుకుంటూ చివరికి చెట్టును ఢీ కొని బస్సు ఆగిపోయింది. ఒకవేళ నేరుగా లోయలోకి పడిపోయి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేదని ప్రయాణికులు తెలిపారు. రామాపుర పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
పెళ్లి నగలు మరిచిపోయి..
● హోటల్ సిబ్బంది నిజాయితీ
యశవంతపుర: కూతురి పెళ్లికి తెచ్చిన బంగారు ఆభరణాలను హోటల్‌లో మరిచి వెళ్లిపోగా, హోటల్ సిబ్బంది నిజాయితీతో తిరిగి వారికి అప్పగించిన ఘటన బాగలకోటలో జరిగింది. బాగలకోటకు సమీపంలోని బెళ్లిఖిండి గ్రామానికి చెందిన లక్ష్మవ్వ ముదనూరు అనే మహిళ కుమార్తె పెళ్లి కోసం లక్షల రూపాయల బంగారం కొనుగోలు చేసి, భోజనం కోసం సదరు హోటల్‌కు వెళ్లారు. తరువాత బ్యాంగ్‌ను అక్కడే వదిలిసి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లాక చూసుకుని, లక్ష్మవ్వ, బంధువులు ఉరుకులు పరుగుల మీద హోటల్‌కు తిరిగి వెళ్లారు. అక్కడ సిబ్బంది నగల బ్యాగ్‌ను భద్రంగా దాచి పెట్టారు. సీసీ కెమెరాల చిత్రాల ప్రకారం లక్ష్మవ్వవేనని గుర్తించి ఆమెకు అప్పగించడంతో సంతోషించారు.
15 కి.మీ.లకు రూ.1200
● బెంగళూరులో ఆటో చార్జీలపై ఆక్రోశం
యశవంతపుర: బెంగళూరులో 15 కిలోమీటర్ల దూరం ఆటోరిక్షాలో వెళ్లినందుకు రూ.1200 చార్జీ వసూలు చేసినట్లు ఓ మహిళ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం వర్షం వస్తున్న సమయంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంది, అందువల్ల స్నేహితులతో కలిసి ఆటోలో వెళ్లాను, ఇందుకు రూ.1200 వసూలు చేశారు, ఇది చాలా ఎక్కువ అని వివరించారు. ఈ పోస్టుపై సాన్యా సింగ్ అనే నెటిజన్ స్పందిస్తూ, బెంగళూరులో ఇలా ఉంటుందని ఊహించలేదు. మంగళవారం తన స్నేహితులతో కలిసి 15 కిలోమీటర్ల దూరం ఆటోలో ప్రయాణించినందుకు 12 వందలు చార్జీ చేశారు. ఈ డబ్బుతో రెండుసార్లు ఇంటి సరుకులను కొనవచ్చు. బెంగళూరులో వయొలిన్ కంటే హార్న్ శబ్దమే జోరుగా వినపడుతుంది. కాలేజీలో ప్రవేశం కంటే ఇక్కడ రైడ్‌ను బుక్ చేయడం కష్టంగా ఉంటుంది అని విమర్శించారు. మన కెరియర్ పెరుగుతుందో, లేదో తెలియదు. ఆటో డ్రైవర్లు మాత్రం శ్రీమంతులు అవుతారని దుయ్యబట్టారు. పెద్ద మొత్తంలో చార్జీ చేయటం అన్యాయమంటూ కొందరు పేర్కొన్నారు. ఈ పోస్టుతో బెంగళూరులో ఆటో, క్యాబ్ చార్జీలు చర్చనీయాంశమయ్యాయి.


