కోలారు: ముళబాగిలు తాలూకాలోని తాయలూరు గ్రామంలో 69వ సంవత్సర గంగ శిరస్సు జాతర వేడుక వైభవంగా జరిగింది. సుమంగళులు తంబిట్టు దీపాలను తలపై మోసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించారు. దేవాలయాన్ని వివిధ రకాల పూలు, పండ్లతో అలంకరించారు. భక్తులు ఉపవాసం చేసి ఆలయంలో పూజలు నిర్వహించారు. గంగశిరస్సు పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తే సకల కష్టాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.
లండన్‌లో ఉద్యోగమని
రూ.37 లక్షల టోపీ
మైసూరు: విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని ఓ వ్యక్తిని నమ్మించి అతని నుంచి రూ.37.35 లక్షల మేర స్వాహా చేసిన ఘటన మైసూరులో జరిగింది. లష్కర్ మొహల్లాకు చెందిన మహ్మద్ యాహియా అనే వ్యక్తి లండన్‌లో హోటల్‌లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రకటనను చూశాడు. ప్రకటనలో ఇచ్చిన మొబైల్ నంబరును సంప్రదించాడు. ఆ సమయంలో కాల్‌లో మాట్లాడిన వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చాడు. ఈక్రమంలో ఎప్పటికప్పుడు మాయమాటలు చెప్పి అతని నుంచి రూ.37.35 లక్షలను వసూలు చేశారు. మళ్లీ డబ్బు కోసం డిమాండ్ చేయడంతో తాను మోసపోయినట్లు ఆలస్యంగా గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు.
మద్యం మత్తులో వైద్యుడు.. సస్పెన్షన్ వేటు
యశంతపుర: వైద్యో నారాయణ హరి అంటారు, కానీ మద్యం తాగి విధులు నిర్వహించిన వైద్యుని ఉదంతమిది. విజయపుర జిల్లా వందాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్ సజ్జన్ మద్యం మత్తులో విధులకు వస్తుంటారు. ఈ విషయం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావ్‌కు తెలిసింది. విచారణ జరిపి అభియోగాలు నిజమని తేలడంతో ఆ వైద్యున్ని సస్పెండ్ చేసినట్లు మంత్రి తెలిపారు. దీనిని చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిపారు.
తాళాలు మింగిన నిందితుడు
దొడ్డబళ్లాపురం: విచారణ సమయంలో నిందితుడు లాకర్ కీని మింగేసిన సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా మాదనాయకనహళ్లి ఠాణాలో జరిగింది. వివరాలు.. బళ్లారికి చెందిన కార్తీక్ రాముపై గత నెలాఖరులో పోక్సో కేసు నమోదయింది. అతనిని అరెస్టు చేసి తీసుకువచ్చిన పోలీసులు ప్రశ్నిస్తుండగా జేబులోఉన్న తాళాలను మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మూడు రోజుల చికిత్సలో అతనికి 10 కేజీల అరటిపండ్లు తినిపించారు. చివరకు టాయ్‌లెట్లో బయటకు వచ్చింది.
గుంతకల్లు– మార్కాపురం
రైలు సర్వీసులు
గుంతకల్లు: గుంతకల్లు–మార్కాపురం రోడ్డు–గుంతకల్లు మధ్య ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లను ప్రవేశపెడుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. గుంతకల్లు–మార్కాపురం రోడ్డు (నంబరు 57407) రైలు మే 13 నుంచి పట్టాలెక్కుతుంది. ఈ రైలు ప్రతి రోజు సాయంత్రం 5:30 గంటలకు బయల్దేరి అదేరోజు రాత్రి 11:30 గంటలకు మార్కాపురం రోడ్డు రైల్వేస్టేషన్‌కి చేరుకుటుంది. ఇక మార్కాపురం రోడ్డు–గుంతకల్లు (57408) ప్యాసింజర్ రైలు మే 14 నుంచి ప్రారంభమవుతుంది. ఈ రైలు ప్రతి రోజు తెల్లవారుజూమున 4:30 గంటలకు బయలుదేరి అదే రోజు ఉదయం 10:30 గంటలకు గుంతకల్లు జంక్షన్‌కు చేరుకుంటుంది. మద్దికెర, పెండేకల్లు, డోన్, రంగాపురం, బేతంచెర్ల, పాణ్యం, నంద్యాల, గాజులపల్లి, దిగువమిట్ట, గిద్దలూరు, సోమదేవపల్లి, కృష్ణపురం, కంభం, తర్లపాడు మీదుగా రాకపోకలు సాగిస్తుంది.


