శివాజీనగర: హెచ్‌ఐవీ రోగినంటూ భార్య, అత్తమామలు దూషించారని ఫ్యామిలీ కోర్టుకు వెళ్లి ఏకపక్షంగా విడాకులు తెచ్చుకున్న భర్తకు హైకోర్టులో షాక్ తగిలింది. భార్య వేసిన కేసు మేరకు హైకోర్టు ఆ విడాకులను రద్దు చేసింది. వివరాలు.. ప్రైవేటు స్కూలు ప్రిన్సిపాల్‌గా పనిచేసే ఆమెకు, ప్రభుత్వ ఉద్యోగి అయిన అతనికి 2002లో పెళ్లయింది, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నేళ్లు బాగానే ఉన్నారు. ఆ తరువాత పిల్లలతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త ఎన్నిసార్లు కోరినా ఆమె రాలేదు. పైగా తాను ఎయిడ్స్ రోగినంటూ దూషించారని భర్త ఓ ఫ్యామిలీ కోర్టులో కేసు వేసి విడాకులు కోరగా మంజూరయ్యాయి. ఇది అన్యాయమని, తనకు విడాకులు వద్దని ఆమె హైకోర్టును ఆశ్రయించారు. జడ్జిలు జస్టిస్ సూరజ్ గోవిందరాజ్, చిల్లకూరు సుమలతలతో కూడిన కల్బుర్గి డివిజనల్ బెంచ్ విచారించింది. ఎయిడ్స్ రోగి అని భార్య నిందించడం తప్పేనని, కానీ అలా నిందించినట్లు భర్త ఆధారాలు చూపలేదని జడ్జిలు పేర్కొన్నారు. భార్య క్రూరత్వం అనేదానికి సైతం రుజువులు చూపలేదని తెలిపారు. చివరకు విడాకులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
తొలి భార్య, పిల్లలకు జీవనభృతి
తొలి భార్య, పిల్లలు, వృద్ధులైన తల్లికి జీవనభృతి ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పడానికి అంగీకరించబోమని, భృతి ఇవ్వడం తప్పనిసరి అని హైకోర్టు ఆదేశించింది. తొలి భార్య, వారి పిల్లలకు రూ.30 వేల భృతి ఇవ్వాలని కుటుంబ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రశ్నిస్తూ ఓ భర్త హైకోర్టులో అర్జీ వేశాడు. న్యాయమూర్తి జస్టిస్ కే.బీ.గీత విచారించారు. రెండో భార్య, పిల్లలను పోషిస్తానని భర్త గతంలో మాట ఇచ్చాడని, ఫోటోస్టూడియో యజమాని, అర్చకునిగా పని చేస్తున్నందున ఆదాయం వస్తూ ఉంటుందని జడ్జి అన్నారు. అతని 74 సంవత్సరాల తల్లి ఓ మెస్‌లో పనిచేస్తూ జీవిస్తోందని తెలిసి జడ్జి.. వారందరి పోషణ నీపైనే ఉందని ఆదేశించారు. నియమాల ప్రకారం మొదటి భార్య కుటుంబానికి జీవనభృతిని అందించాలని తెలిపారు.
ఓ భర్తకు హైకోర్టు షాక్
ఎయిడ్స్ రోగి అని భార్య
దూషించేదన్న భర్త


