హైకమాండ్‌ ఆదేశిస్తే ఐదేళ్లూ నేనే సీఎం | - | Sakshi
Sakshi News home page

హైకమాండ్‌ ఆదేశిస్తే ఐదేళ్లూ నేనే సీఎం

May 7 2026 9:32 AM | Updated on May 7 2026 9:32 AM

మైసూరు: తాను ముఖ్యమంత్రిగా కొనసాగాలా? వద్దా? అనేది తమ కాంగ్రెస్‌ హైకమాండ్‌ తీర్మానిస్తుందని, హైకమాండ్‌ చెప్పినట్లు వింటానని సీఎం సిద్దరామయ్య అన్నారు. సిద్దరామయ్య బుధవారం మైసూరు విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదేళ్ల పాలన పూర్తి చేస్తుందన్నారు. అధిష్టానం ఆదేశిస్తే ఐదేళ్లుగా సీఎంగా ఉంటానని, వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. హైకమాండ్‌ పిలిస్తే ఢిల్లీకి వెళ్లి మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై చర్చిస్తానని అన్నారు. త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపిస్తామని సీఎం అన్నారు. శృంగేరిలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను బీజేపీ అభ్యర్థి, ఎన్నికల సిబ్బంది కలిసి మార్చేశారని సీఎం ఆరోపించారు. ఈ విషయంపై తాము కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు.

పిలిస్తేనే ఢిల్లీకి: డీసీఎం

శివాజీనగర: హైకమాండ్‌ ఆహ్వానించినపుడు వెళతాం, పిలవకుండా వెళ్లడం సరికాదు.. అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ అన్నారు. బెంగళూరులో నివాసం వద్ద మాట్లాడుతూ దావణగెరెలో కొందరు నేతలను తొలగించడం పార్టీ నిర్ణయమన్నారు. సీఎం రాజకీయ కార్యదర్శిని తీసేయడంపై ముఖ్యమంత్రి మాట్లాడారన్నారు. లౌకికవాద శక్తులు ఒక్కటిగా ఉండాలని, అందుకే తమిళనాడులో విజయ్‌కు కాంగ్రెస్‌ మద్దతు ఇచ్చిందన్నారు.

సిద్దరామయ్య నోట అదే మాట

Advertisement
 
Advertisement
Advertisement