సైలెంట్‌ కిల్లర్‌..హైపర్‌నాట్రేమియా | - | Sakshi
Sakshi News home page

సైలెంట్‌ కిల్లర్‌..హైపర్‌నాట్రేమియా

May 7 2026 9:32 AM | Updated on May 7 2026 9:32 AM

సాక్షి,బళ్లారి: ఈ ఏడాది భానుడు తన ప్రతాపాన్ని క్రమంగా పెంచుతున్నాడు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు చిన్నారులతో పాటు పెద్దలు, బాగా ఆరోగ్యంగా ఉన్న వారు కూడా బయట తిరిగేందుకు భయపడుతున్నారు. బిసిల బళ్లారిగా పేరొందిన బళ్లారిలో ఎండల ప్రభావం సహజంగానే మరింత ఎక్కువగా ఉంటుంది. ఎండల ప్రభావంతో జిల్లాలో అక్కడక్కడ ఎండలో నిలిపిన వాహనాల్లో మంటలు కూడా వ్యాపిస్తున్నాయి. ఎండల ప్రభావంతో చిన్నారులు ముఖ్యంగా నవజాత శిశువుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు చిన్నారులు, నవజాత శిశువులతో కిటకిటలాడుతున్నాయి. ఈసారి ఏప్రిల్‌ నెల ప్రారంభం నుంచి ఎండల ప్రభావం ఒక్కో రోజు ఒక్కో విధంగా పెరుగుతోంది. విపరీతమైన ఎండలకు తోడు ఉక్కపోత ఉండటంతో శరీరంలో నీటి శాతం తగ్గిపోవడంతో అనారోగ్యాల బారిన పడుతున్నారు. కొందరు డీహైడ్రేషన్‌కు లోనై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. పెద్దల పరిస్థితి ఇలా ఉంటే చిన్నారులు, నవజాత శిశువుల విషయంలో మరింతగా జాగ్రత్తలు తీసుకోవాలని వెద్యులు హెచ్చరిస్తున్నారు.

ఆస్పత్రుల వద్ద బారులు

చిన్నారులు, నవజాత శిశువుల్లో హైపర్‌నాట్రేమియా అనే ప్రమాదకర పరిస్థితి పెరుగుతుండటంతో ఆస్పత్రుల వద్దకు చిన్నారులు, నవజాత శిశువులను ఎత్తుకుని తల్లిదండ్రులు పరుగులు తీస్తున్నారు. విపరీతంగా ఎండలు పెరిగిపోవడం వల్ల నీటి లోపం ఏర్పడి రక్తంలో సోడియం స్థాయి అధికమవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎండల్లో చెమట ద్వారా శరీరం ఎక్కువగా నీటిని కోల్పోతుందని, సరిపడా ద్రవ రూపంలో నీరు శరీరానికి అందకపోతే చిన్నారులు త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతారని, దీంతో రక్తంలో సోడియం స్థాయి పెరిగి హైపర్‌నాట్రేమియా ఏర్పడుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా సమస్య అధిగమించడానికి జిల్లా ఐఏంఐ అధ్యక్షుడు, చిన్నారుల ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్‌ రాజేష్‌ చిన్నారులను ఎండల బారి నుంచి ఎలా కాపాడుకోవాలో వివరించారు. ఈసారి ఎండల ప్రభావం తీవ్రంగా ఉందని, చిన్నారులు, నవజాత శిశువుల్లో హైపర్‌నాట్రేమియా అనే ప్రమాదకర పరిస్థితి పెరుగుతోందన్నారు.

ఎక్కువగా నీటిని తాగాలి

నవజాత శిశువుల్లో ఎక్కువగా కనిపిస్తోందని, దీనికి ప్రధాన నివారణ తల్లులు ఎక్కువ నీరు తాగాలని, తల్లి మంచినీరు ఎక్కువగా తాగడం, పండ్ల రసాలు, పాలు తదితర నీరు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల సహజంగానే పాల ఉత్పత్తి పెరుగుతుందన్నారు. నవజాత శిశువులకు పాలు ఎక్కువగా ఇవ్వడం వల్ల హైపర్‌నాట్రేమియా రాదని సూచించారు. తల్లులు పాలు ఇవ్వకపోతే అప్పుడే పుట్టిన బిడ్డకు, నెలలు నిండిన పసికందులకు ఈ సమస్య ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయన్నారు. నవజాత శిశువులు తమ పరిస్థితి చెప్పలేరని, ఈ నేపథ్యంలో తల్లులు అప్రమత్తంగా ఉండి కాపాడుకోవాలన్నారు. ఇక చిన్నారుల విషయానికి వస్తే దాహం వచ్చినప్పుడు వెంటనే నీరు తాగాలన్నారు. నోరు ఎండిపోకుండా చూసుకోవాలన్నారు. అలసట, ఏడుపు ఎక్కువగా ఉండటం, మూత్రం తగ్గిపోవడం, జ్వరం, గుండెవేగం పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. శిశువులకు తరుచుగా తల్లిపాలు ఇవ్వాలన్నారు. పిల్లలకు నీరు, ద్రవ పదార్థాలను ఎక్కువగా ఇవ్వాలన్నారు.

ఎండల్లో జాగ్రత్తలు పాటించాలి

మరీ ముఖ్యంగా ఎండల్లో బయటకు వెళ్లకూడదన్నారు. తేలికపాటి దుస్తులు వేసుకోవాలన్నారు. హైపర్‌నాట్రేమియా ప్రమాదకరమైందని, అయితే గుర్తిస్తే ఎలాంటి సమస్య ఉండదన్నారు. మండే ఎండల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హైపర్‌నాట్రేమియా అనేది రక్తంలో సోడియం స్థాయి 145 ఎంఈక్యూ–ఎల్‌ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు కనిపించే ఒక రకమైన ప్రమాదకర పరిస్థితి అని, ఇది అప్పుడే పుట్టిన బిడ్డలకు, నెలలు నిండిన నవజాత శిశువుల్లో మరీ ఎక్కువగా కనిపిస్తుందన్నారు. వేసవిలో పుట్టే పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చాలా మంది తల్లులు నీరు తక్కువగా తాగుతారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. తల్లులు ఎక్కువగా నీరు తాగితేనే నవజాత శిశువులకు పాలు పుష్కలంగా అందుతాయని అన్నారు.

ఆలస్యంగా గుర్తించినా ప్రమాదమే

హైపర్‌నాట్రేమియాను గుర్తించకపోతే, అలస్యంగా చికిత్స చేసినా మెదడు రక్తస్రావం వంటి సమస్యలు, రక్తం గడ్డకట్టడం, కిడ్నీ సమస్యలు, రక్తంలో చక్కెర స్థాయిలో మార్పులు, మెటబాలిక్‌ అసిడోసిస్‌ వంటి ఇతర సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఈ పరిస్థితులు వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయన్నారు. ఎండా కాలంలో ముఖ్యంగా ఏప్రిల్‌, మే నెలల్లో ప్రసవించిన తల్లులు చాలా జాగ్రత్తలు పాటించాలన్నారు. ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలని, సరిగా పాలు ఇవ్వాలని, పాలిచ్చే విధానం కూడా తెలుసుకోవాలన్నారు. శిశువులను బయటకు తీసుకుని వచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇక 1 నుంచి 10 ఏళ్ల లోపు చిన్నారులు కూడా వేసవి సెలవుల నేపథ్యంలో బయటకు ఆడేందుకు వెళుతుంటారని, వారి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎండలోకి వెళ్లకుండా, ఎక్కువగా నీరు తాగేవిధంగా చూడాలన్నారు. హైపర్‌నాట్రేమియా పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదన్నారు.

చిన్నారుల్లో ఎక్కువగా కనిపిస్తున్న వైనం

ఆస్పత్రుల వద్ద శిశువులతో తల్లిదండ్రులు

Advertisement
 
Advertisement
Advertisement