మద్యం బాటిల్‌ కోసం ఇనుప రాడ్డుతో దాడి | - | Sakshi
Sakshi News home page

మద్యం బాటిల్‌ కోసం ఇనుప రాడ్డుతో దాడి

May 7 2026 9:32 AM | Updated on May 7 2026 9:32 AM

హుబ్లీ: మద్యం బాటిల్‌ ఇవ్వలేదన్న కోపంతో ఇద్దరు మానసిక అస్వస్తుడిపై ఇనుపరాడ్డు, ఇటుకలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన స్థానిక హుండి ప్లాంట్‌ బాలవ్వన చౌక్‌ దొడ్డమని కాలనీలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. ఘటనలో మానసిక అస్వస్తుడైన అనోక్‌ జమఖండి గాయపడ్డారు. రఘు, నిరంజన్‌ దాడి చేశారని అనోక్‌ అన్న అఖిత్‌ ఫిర్యాదు చేశాడు. అమన్‌ ఇచ్చిన మద్యం బాటిల్‌ను అనోక్‌ పట్టుకొని నిలబడ్డాడు. దాన్ని ఇవ్వమని రఘు, నిరంజన్‌ అడగగా ఇవ్వడానికి నిరాకరించడంతో ఆగ్రహానికి గురై బాటిళ్లు లాక్కొనే క్రమంలో రాడ్డు, ఇటుకలతో తల వీపు మీద కొట్టి హత్యాయత్నానికి ప్రయత్నించారని అఖిత్‌ బెండిగేరి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

యరగేరలో ఎక్స్‌ప్రెస్‌ బస్సులను ఆపండి

రాయచూరు రూరల్‌: రాయచూరు నుంచి మంత్రాలయానికి యరగేర మీదుగా వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ బస్సులను యరగేరలో నిలపాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. మంగళవారం నాడ కార్యాలయం వద్ద అధ్యక్షుడు నిజాముద్దీన్‌ మాట్లాడుతూ రాయచూరు నుంచి 15 కి.మీ.ల దూరంలో ఉన్న యరగేరలో ఆర్టీసీ బస్సులను నిలపకుండా నేరుగా వెళుతున్నారన్నారు. రాయచూరు నుంచి ఆదోని, కర్నూలు, మంత్రాలయం, బెంగళూరు వరకు వెళుతున్న బస్సులను నిలపాలని కోరుతూ ఆర్టీసీ డిపో మేనేజర్‌, నాడ తహసీల్దార్‌లకు వినతిపత్రాలు సమర్పించారు.

అంబులెన్స్‌లో కవలల జననం

హొసపేటె: తాలూకాలో అంబులెన్స్‌లో ఒక మహిళ కవలలకు జన్మనిచ్చిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. తాలూకాలోని మరియమ్మనహళ్లి సమీపంలోని హంపనకట్టెకు చెందిన షకీలా అనే మహిళకు ఇంట్లో పురిటి నొప్పులు రావడంతో ఆమెను హంపనకట్టె గ్రామం నుంచి తల్లీ, బిడ్డల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన అంబులెన్స్‌లో నగరంలోని 60 పడకల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలో ఆమె అంబులెన్స్‌లో కవల పిల్లలకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు అత్యవసర ఆరోగ్య నిపుణుడు జే.అనిల్‌కుమార్‌ తెలిపారు.

అంబేడ్కర్‌ జాతీయ ప్రైడ్‌ ఎక్సలెన్స్‌ అవార్డు ప్రదానం

బళ్లారిఅర్బన్‌: ప్రజా నాయకత్వం, సామాజిక న్యాయం, సమాజ అభివృద్ధికి చేసిన సేవలను గుర్తింపుగా నగర కేపీసీసీ ఎస్సీ విభాగం ఉపాధ్యక్షుడు కందుకూరు రాముడుకు బెంగళూరులోని ది ఇండియన్‌ ఫోరం ఫర్‌ సోషల్‌ లీడర్స్‌ అండ్‌ అఛీవర్స్‌ సంస్థ– 2026వ సంవత్సరానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జాతీయ ప్రైడ్‌ ఎక్సలెన్స్‌ అవార్డును ప్రదానం చేసింది. సంస్థ గౌరవ అధ్యక్షులు, విశ్రాంత న్యాయమూర్తి డాక్టర్‌ కే.వెంకటేషన్‌ రాముడుకు ఈ అవార్డును అందజేశారు. అవార్డును స్వీకరించిన సందర్భంగా రాముడును జిల్లాధికారి కే.నాగేంద్ర ప్రసాద్‌ అభినందించారు.

ఘనంగా పుట్టినరోజు వేడుక

బళ్లారిఅర్బన్‌: కర్ణాటక రక్షణ వేదిక (ప్రవీణ్‌శెట్టి వర్గం) జిల్లా అధ్యక్షుడు వీహెచ్‌.హులుగప్ప 41వ పుట్టినరోజు వేడుకలు బళ్లారిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కేక్‌ కట్‌ చేశారు. కరవే రాష్ట్ర సంచాలకుడు అద్దిగేరి రామన్న మాట్లాడుతూ హులుగప్ప సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్న సమర్థ నాయకుడని కొనియాడారు. అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జెస్కాం ఎండీగా జహీరా నసీం

రాయచూరు రూరల్‌: గుల్బర్గా విద్యుత్‌ సరఫరా మండలి(జెస్కాం) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా జహీరా నసీం మంగళవారం జెస్కాం కార్యాలయంలో పదవీ బాధ్యతలను చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కలబుర్గి విభాగంలో విద్యుత్‌ చౌర్యం నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్‌ బిల్లుల బకాయిల వసూలుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు.

వైద్య రంగంలో సేవలు నిరంతరం

రాయచూరు రూరల్‌: విద్యా, వైద్య రంగంలో నవోదయ వైద్య కళాశాల అధ్యక్షుడు రాజేంద్ర రెడ్డి సేవలు, సాధన నిరంతరమని అభిమానుల సంఘం సంచాలకుడు మారెప్ప అన్నారు. బుధవారం నగరంలోని నవోదయ వైద్య కళాశాలలో రాజేంద్రరెడ్డి పుట్టినరోజు వేడుకలను జరిపి మాట్లాడారు. నవోదయ వైద్య కళాశాల చేస్తున్న వైద్య సేవలు అనన్యమన్నారు. పేదలకు ఉచిత సేవ చేస్తున్నారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement