సాక్షిబళ్లారి: వీధి కుక్కల బెడద రోజురోజుకు పెరుగుతుండటంతో పాటు దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్న ఘటనలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. బుధవారం విజయపుర జిల్లాలో మూడేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి చేసి కరిచి నోటితో 10 అడుగుల మేర ఈడ్చుకెళ్లిన ఘటన సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయింది. స్థానికుల సహాయంతో బాలుడిని రక్షించి ఆస్పత్రిలో చేర్పించారు. విజయపురలోని రాజ్‌కుమార్ లేఅవుట్‌లో సంతోష్ బిరాదార్(3) అనే బాలుడిని వీధి కుక్క కరవడంతో పాటు ఈడ్చుకెళ్లింది. ఇంట్లోని వారు బాలుడిని ఆడుకునేందుకు బయటకు వదిలారు. దీంతో బాలుడు ఆడుతున్న సమయంలో వీధి కుక్క విచక్షణ రహితంగా కరిచి గాయపరిచి ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులతో పాటు ప్రతి ఒక్కరిని కలిచివేసింది. వీధి కుక్కల నియంత్రణకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా స్థానిక సంస్థలు, పాలకుల నిర్లక్ష్యంతో కుక్కలు యథేచ్ఛగా దాడి చేసి గాయపరుస్తున్నాయి.
జిల్లాధికారిణిగా పూవిత
●నితీష్ బదిలీ
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాధికారి నితీష్‌ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి మహంతేష్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఆయన స్థానంలో కర్ణాటక ఆర్థిక, మౌలిక సౌకర్యాల శాఖ మేనేజింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న 2016వ సంవత్సరం ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన పూవితను నియమించారు. ఇప్పటి వరకు రాయచూరు జిల్లాధికారిగా పని చేసిన నితీష్‌కు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా బెంగళూరు కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని సూచించారు. మూడు రోజుల క్రితం కలబుర్గి జిల్లాధికారిణి ఫౌజియా తరన్నంను కూడా బెంగళూరుకు బదిలీ చేఽశారు.
చలివేంద్రం ప్రారంభం
రాయచూరు రూరల్: నగరంలోని ఎల్‌ఐసీ డివిజనల్ కార్యాలయం వద్ద ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎల్‌ఐసీ సీనియర్ డివిజనల్ మేనేజర్ వై.వెంకటేశ్వరరావు ప్రారంభించారు. మేనేజర్లు సుఖేష్, వంశీనాథ్, శివశంకర్ రావు, సంఘం అధ్యక్షులు శరణే గౌడ, కార్యదర్శి రవి, శ్రీధర్, రాఘవేంద్ర, వీరేష్, లత, జమున, శ్రీశైల, మహంతగౌడలున్నారు.
బాలంకు ఆస్పత్రి యజమాని మృతి
రాయచూరు రూరల్: బాలంకు ఆస్పత్రి యజమాని బాలిరెడ్డి(90) మృతి చెందారు. మంగళవారం తెల్లవారు జామున సింధనూరు తాలూకా రైతు నగర(తిమ్మారెడ్డి క్యాంప్)లో ఆయన కన్నుమూశారు. ఆయన కుమారుడు శ్రీధర్‌రెడ్డి నగరంలో బాలంకు ఆస్పత్రిని నడుపుతున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, కుమార్తెలున్నారు. ఆయన అంత్యక్రియలను స్వస్థలంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య నెరవేర్చారు.
రైతుల సొమ్ము అందజేత
రాయచూరు రూరల్: రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి డబ్బులివ్వకుండా పారిపోయిన దళారుల నుంచి బకాయి సొమ్ము వసూలు చేసిన ఉదంతం యాదగిరి జిల్లాలో జరిగింది. యాదగిరి జిల్లా సురపుర తాలూకాలోని బైచబాళ, కూడలిగిల్లో రైతులు వరి ధాన్యాన్ని విక్రయించారు. అయితే మధ్యవర్తులు డబ్బులివ్వకుండా పరారయ్యారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి రాజుగౌడకు వివరించారు. ఆయన వారి ఆచూకీని కనుగొని రైతులకు రావాల్సిన రూ.71 లక్షలు వసూలు చేసి రైతులకు అప్పగించారు.
మహిళా బిల్లును వ్యతిరేకించలేదు
కోలారు: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించలేదని, బిల్లు వెనుక ఉన్న కుట్రను మాత్రమే వ్యతిరేకించామని కేజీఎఫ్ ఎమ్మెల్యే రూపా శశిధర్ తెలిపారు. బుధవారం నగరంలోని పాత్రికేయుల భవనంలో మాట్లాడారు. బీజేపీ దూరదృష్టి లేకుండా మహిళా బిల్లును ప్రవేశ పెట్టడం సరికాదని అన్నారు. డీలిమిటేషన్‌తో కలపడం బీజేపీ కుట్రలో భాగమని అన్నారు. బీజేపీ మహిళలకు ఎలాంటి గౌరవం ఇస్తుందనే దానికి మణిపూర్ ఘటనలే నిదర్శనమన్నారు. కాంగ్రెస్ నాయకురాలు వసంత కవితా రెడ్డి, హేమమాలిని తదితరులు పాల్గొన్నారు.


