హొసపేటె: నగరంలోని డీఏఆర్ మైదానంలో రూ.6.69 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పోలీసు నివాస సముదాయానికి ఎమ్మెల్యే హెచ్‌ఆర్ గవియప్ప మంగళవారం భూమిపూజ చేశారు. 12 మంది కానిస్టేబుళ్లు, 6 మంది సబ్ ఇన్‌స్పెక్టర్ల నివాస గృహాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 36 నివాస గృహాలను నిర్మించారన్నారు. ప్రస్తుతం మరో 18 నివాస గృహల నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. జిల్లా కేంద్రంలో మొత్తం 142 నివాస గృహాల అవసరం ఉండగా, మరో 32 నివాస గృహాల మంజూరు కోసం హోం మంత్రికి వినతిపత్రాన్ని సమర్పిస్తామన్నారు. మహిళా పోలీసు స్టేషన్ నిర్మాణానికి కూడా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. జిల్లా ఆస్పత్రిని త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. జిల్లా ఎస్పీ జాహ్నవి, అదనపు ఎస్పీ మంజునాథ్, డీఎస్పీ డాక్టర్ మంజునాథ్ తల్వార్ తదితరులు పాల్గొన్నారు.


