● రాజధానిలో మోతెక్కిపోతున్న రేట్లు
● మసాలా దోసె రూ.100
● ప్లేటు పూరీ.. అంతే ధర
● యుద్ధం, గ్యాస్ ధరలతో మంట
సాక్షి, బెంగళూరు: ఐటీ సిటీలో మామూలుగానే హోటళ్లలో ధరలు ఎక్కువ. ఇప్పుడు ఇరాన్ యుద్ధం, గ్యాస్ ధరల పెంపు వల్ల మరింతగా హోటల్ సందర్శకులపై భారం పడుతోంది. ఏమి కొనేటట్లు లేదు.. ఏమి తినేటట్లు లేదు అనేలా హోటళ్లలో రేట్లు భగ్గుమంటున్నాయి. గత వారంలోనే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూ. 993 మేర కేంద్రం పెంచింది. గత రెండు నెలల కాలంలో వాణిజ్య సిలిండర్ ధర రూ. 1,490 మేర పెరిగింది. దీనిని కారణంగా చూపుతూ నగరంలోని ఎక్కువ శాతం హోటళ్లు ఆహార పదార్థాలు, టీ, కాఫీ ధరలను పెద్దమొత్తంలో పెంచేశాయి. దీంతో ఆరగిద్దామని వెళ్లేవారికి జేబులకు చిల్లులు పడుతున్నాయి.
నెలరోజుల్లో రెండోసారి బాదుడు
● బెంగళూరు నగరంలో సుమారు 40 వేళ్లకు పైగా హోటళ్లు ఉన్నాయి. వీటన్నింటిలో ఆహార పదార్థాల ధరలు పెరిగాయి.
● ఒక నెల రోజుల క్రితమే గ్యాస్ కొరత నెపంతో హోటళ్లు టిఫిన్, భోజన ధరలను పెంచాయి.
● భోజనం ధర రూ. 10 నుంచి రూ. 20 మేర, టిఫిన్ ధరలు రూ 5–10 మేర పెరిగాయి. ఇడ్లీ రూ. 5, దోసె రూ. 10 వరకూ రేటు అధికమైంది.
● మల్లేశ్వరంలోని ప్రముఖ హోటళ్లలో రెండు పూరీలు, కూర ధర రూ. 100కు చేరింది. రెండు నెలల క్రితం ఈ ధర రూ. 80 వద్ద ఉండేది. ప్లేటు పులిహోరె రూ. 70 నుంచి రూ. 80కు పెరిగింది.
● జయనగర మూడో బ్లాక్‌లో దోసె క్యాంప్ హోటల్‌లో గతంలో మసాల దోసె రూ. 90 ఉండగా ఇప్పుడు రూ.100కు పెంచేశారు.
భోజనం మరింత ప్రియం
బెంగళూరులో కామత్ హోటళ్ల గురించి తెలిసిందే. వీటిలో గతంలో భోజన ధర రూ. 120 ఉండగా, నేడు అది రూ.140కి చేరింది. గతంలో దోసె రూ. 90 అయితే ఇప్పుడు వంద అయ్యింది. రూ.20 ఉన్న టీ ధర రూ.25కు పెరిగింది. సింగిల్ పూరీ రూ. 50 నుంచి రూ. 55కు చేరింది. కొన్ని దర్శిని హోటళ్లలో రూ.90 ఉన్న భోజనం రేటు రూ. 100కు పెంచారు. ఇలా ఏది ముట్టుకున్నా అదనంగా చెల్లించాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు.
సామాన్యులపై భారం
రేట్ల పెంపు వల్ల కొన్ని నెలల్లో హోటళ్లకు 15–20 శాతం సందర్శకుల సంఖ్య క్షీణించినట్లు సమాచారం. బ్యాచిలర్లు, అల్పాదాయ ప్రజలు ధరల్ని తలచుకుని అమ్మో అంటున్నారు. చిన్నపాటి హోటళ్లలో 200 గ్రాముల కబాబ్‌కు రూ.100 ఉండగా ఇప్పుడు రూ. 120కి పెరిగింది. చికెన్ బిర్యానీ ధర కూడా చిన్నహోటళ్లలో రూ. 130 నుంచి రూ. 140కి పెంచారు. వంట గ్యాస్ కొరత తీరుతోందని అనుకునేలోపల ధరలతో ఇబ్బంది వచ్చింది.


