గౌరిబిదనూరు: నగరంలో వీరశైవ లింగాయత పంచ పీఠాల భక్తులు ఏర్పాటు చేసిన జగద్గురు రంభాపురి వీర సింహాసనాధీశ్వర 1008 జగద్గురు ప్రసన్న రేణుకా వీరసోమేశ్వర రాజ దేశికేంద్ర శివాచార్య మహాస్వామి అడ్డపల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది. సోమ, మంగళవారాలు పల్లకీ వేడుకలు పుర వీధులలో అట్టహాసంగా సాగాయి. జానపద బృందాల ప్రదర్శనలు అలరించాయి. స్వామీజీలు మాట్లాడుతూ సమాజంలో ధర్మ జాగృతి, శాంతి తదితర ప్రాముఖ్యతను వివరించారు.
అంబాదేవి హారతి వేడుక
తుమకూరు: జిల్లాలోని శిరా తాలూకా హులికుంటె ఫిర్కా హొసహళ్లి గ్రామంలోని శ్రీ అంబాదేవి దేవస్థానం 20వ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. హొసహళ్లి, నేరలహళ్లితో పాటు చుట్టుపక్కల పలు గ్రామాల భక్తులు, మహిళలు జ్యోతులు మోసుకొచ్చి అంబాదేవికి హారతి ఉత్సవం నిర్వహించారు. అర్చకులు హెచ్‌ఎం శశిధర్ ఆధ్వర్యంలో పూజలు జరిగాయి.
రాష్ట్ర సర్కారుతో ప్రజలకు విసుగు: కుమార
తుమకూరు: రాష్ట్రంలోని ఇప్పటి ప్రభుత్వ పాలనపై ప్రజలు విసుగు చెందారని, రాబోయే రోజుల్లో బీజేపీ, జేడీఎస్ కూటమిని ప్రజలు ఆశీర్వదించాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి అన్నారు. తుమకూరు తాలూకా ముళకుంటె గ్రామంలో మంగళవారం జరిగిన విజయ చౌడేశ్వరి దేవి జాతర మహోత్సవంలో ఆయన పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. తరువాత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ సర్కారు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిందన్నారు. ఈ గెలుపు దేశ తదుపరి ఎన్నికలకు దిక్సూచి అన్నారు. ఈ సభలో జిల్లా జేడీఎస్ అధ్యక్షుడు హెచ్.నింగప్ప, సీబీ సురే
ష్‌బాబు, ఎమ్మెల్యేలు బీ.సురేష్‌గౌడ, ఎంటీ కృష్ణప్ప, మాజీ ఎమ్మెల్సీ చౌడరెడ్డి పాల్గొన్నారు.
8 నుంచి కబ్బన్‌పార్క్‌లో మామిడి, పనస మేళా
శివాజీనగర: ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మే 8 నుంచి 17 వరకు బెంగళూరు కబ్బన్ పార్కులో రాష్ట్రస్థాయి మామిడి, పనస ప్రదర్శన, అమ్మక మేళా జరగనుంది. సహజంగా మాగబెట్టిన పండ్లు, రైతులు నేరుగా విక్రయించడం వల్ల మంచి ధరలకే లభిస్తాయని చెప్పారు. మామిడి రైతులకు మార్కెటింగ్ నేరుగా లాభాల గురించి సమాచారం అందస్తారు. ఉత్తమ రకాలైన పనస, మామిడి పండ్లు లభిస్తాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 1.45 లక్షల హెక్టార్లలో మామిడి తోటలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల మామిడి పూత ఆలస్యమైంది. మామిడి పండ్ల సరఫరా లేటుగా జరుగుతోంది. దీని వల్ల పండ్లు ఎక్కువ కాలం లభిస్తాయని చెప్పారు.
ఇస్రో క్యాంపస్‌పై
అనుమానిత డ్రోన్
శివాజీనగర: బెంగళూరులో ఇస్రో క్యాంపస్‌పై గుర్తుతెలియని డ్రోన్ విహారం కలకలం రేపింది. మే 2న ఉదయం 8:16 గంటల సమయంలో కార్తీక్ నగరలోని ఇస్రో ఉపగ్రహ యూనిట్, పరీక్షా కేంద్రంపై సుమారు 80 నుంచి 100 అడుగుల ఎత్తులో కొన్ని క్షణాల పాటు గుర్తు తెలియని డ్రోన్ విహరించిందని సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది హెచ్‌ఏఎల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దేశ భద్రత దృష్ట్యా ఇస్రో క్యాంపస్ సున్నిత ప్రదేశంకాగా, నో డ్రోన్ జోన్‌గా గుర్తించబడింది. డ్రోన్‌ను ఎగురవేసినవారిని గుర్తించి, దర్యాప్తు చేయాలని ఫిర్యాదులో కోరారు.
పసిబిడ్డ విక్రయం ఉత్తిదే..
బనశంకరి: భార్య గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయి, రెండున్నరేళ్లు వయసుగల చిన్నారిని రూ.5 లక్షలకు అమ్మేసిందని భర్త తప్పుడు ఫిర్యాదు చేసినట్లు తేలింది. అలాంటిది ఏదీ జరగలేదని బెంగళూరు వివేకనగర పోలీసులు కనిపెట్టారు. దంపతుల మధ్య గొడవలతో ఇలా ఫిర్యాదు చేశాడని చెప్పారు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.


