ప్రపంచస్థాయికి బెంగళూరు | - | Sakshi
Sakshi News home page

ప్రపంచస్థాయికి బెంగళూరు

May 6 2026 8:13 AM | Updated on May 6 2026 8:13 AM

మాస్టర్‌ప్లాన్‌ తయారీకి ఒప్పందం: డీసీఎం

బనశంకరి: బెంగళూరును ప్రపంచస్థాయి ప్రగతి హబ్‌ గా తీర్చిదిద్దడానికి గత మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నామని డీసీఎం డీకే.శివకుమార్‌ తెలిపారు. బెంగళూరు పురోగతికి ఆర్థిక మాస్టర్‌ప్లాన్‌ రూపొందించడం ఐఎస్‌ఈజీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. మంగళవారం విధానసౌధలో నగరాభివృద్ధిశాఖ కార్యదర్శి తుషార్‌ గిరినాథ్‌, ఐఎస్‌ఈజీ డైరెక్టర్‌ డాక్టర్‌ శిరీష్‌ సంఖ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా డీకే మాట్లాడుతూ బెంగళూరు చుట్టుపక్కల రికార్డు స్థాయిలో ఆర్థిక శక్తిని అందించామని చెప్పారు. 8 వేల చదరపు కిలోమీటర్ల కంటే పెద్దదైన బెంగళూరు అభివృద్ధి, ఎగుమతుల్లో దూసుకెళ్తోందన్నారు. బెంగళూరుకు 500 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో 2032 నుంచి 2037 వరకు చేపట్టాల్సిన ఆర్థిక మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. టూరిజం అభివృద్ధి, ఉద్యోగ కల్పన, ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం తదితరాలు ఇందులో ఉంటాయన్నారు. సుమారు రూ.2 లక్షల కోట్ల విలువచేసే పథకాన్ని దశలవారీగా కార్యరూపంలోకి తీసుకువస్తామన్నారు. ఇందుకోసం ఐటీ, పారిశ్రామిక రంగాల ప్రముఖులతో పాటు ప్రజల నుంచి సలహాలను సేకరిస్తామన్నారు. బెంగళూరును ప్రపంచ నగరాలతో పోటీపడేలా చేస్తామని తెలిపారు.

ఎయిర్‌పోర్టులో

కొత్త భద్రతా చర్యలు

శివాజీనగర: దేశ, విదేశాల్లో ఇటీవల విమాన ప్రమాదాలు అధికమవుతున్న నేపథ్యంలో బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (కేఐఏ) భద్రత దృష్ట్యా కొత్త చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. విమానాలు సంచరించే స్థలంలో భద్రత పెంచేందుకు ‘స్మార్ట్‌ ఏర్‌సైడ్‌ సేఫ్టీ సిస్టం’ అనే కొత్త సాంకేతికను అమల్లోకి తీసుకొచ్చారు. స్మార్ట్‌ కెమెరాలు, ఏఐ పరిజ్ఞానంతో విమానాశ్రయ వాహనాల సంచారంపై నిఘా వేస్తారు. అలాగే పొగమంచులో, వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు విమానాలకు ప్రమాదం జరగకుండా చూస్తారు.

కుర్చీ గందరగోళాన్ని

సరిదిద్దాలి: మంత్రి సతీశ్‌

బనశంకరి: సీఎం పదవి మార్పు గురించి సీఎం, డిప్యూటీ సీఎంను పార్టీ హైకమాండ్‌ ఢిల్లీకి పిలిపించి గందరగోళాన్ని నివారించాలని ప్రజాపనుల శాఖ మంత్రి సతీశ్‌ జార్కిహొళి డిమాండ్‌ చేశారు. మంగళవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ సీఎం మార్పు గురించి మల్లికార్జున్‌ఖర్గే రెండురోజులక్రితం చెప్పారని, ఎన్ని రోజులు ఇలాచెబుతారని, హై కమాండ్‌ నేతలు అందరి అభిప్రాయాలు తీసుకుని తీర్మానం చేసి గందరగోళానికి చెక్‌ పెట్టాలన్నారు. అహింద ఓట్లతోనే గెలుపు సాధ్యమైందని, 2028లో అహిందను ఏకతాటిపైకి తీసుకురావడం సవాల్‌గా మారిందని అన్నారు. దావణగెరె ఉప ఎన్నికలో మైనారిటీల ఓట్లు మైనస్‌ కావడం చేతులారా జరిగిందని అన్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందని, అంతలోగా దీనిని సరిదిద్దాలన్నారు.

పోలీసు ఆత్మహత్య

మైసూరు: మానసిక వేదనతో విసిగిపోయి పోలీసు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మైసూరులో జరిగింది. మృతున్ని మైసూరులోని దేవరాజ పోలీసు స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ శ్యాంప్రసాద్‌ (45)గా గుర్తించారు. నగరంలోని పోలీస్‌ లేఔట్‌లోని సొంత ఇల్లు కలిగిన శ్యాంప్రసాద్‌ దేవరాజ పోలీసు స్టేషన్‌లో గత ఐదేళ్లుగా పనిచేస్తున్నారు. డ్యూటీకి రాకపోవడంతో మంగళవారం ఉదయం పోలీసులు వచ్చి చూడగా ఇంట్లో ఉరికి వేలాడుతూ ఉన్నాడు. నజరబాద్‌ పోలీసులు స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. కుటుంబ కలహాలు, ఉద్యోగంలో ఒత్తిళ్లే కారణమని అనుమానాలున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement