మంత్రి జమీర్‌ ఇంట్లో నగల చోరీ | - | Sakshi
Sakshi News home page

మంత్రి జమీర్‌ ఇంట్లో నగల చోరీ

May 6 2026 8:13 AM | Updated on May 6 2026 8:13 AM

యశవంతపుర: ఏకంగా మంత్రి ఇంటికే కన్నం వేశారు కేటుగాళ్లు. గృహ నిర్మాణశాఖ మంత్రి జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌ నివాసంలో బంగారు నగలను చోరీ చేసిన ఇద్దరు దొంగలను బెంగళూరు శివాజీనగర పోలీసులు అరెస్ట్‌ చేసి రూ.1.13 కోట్ల విలువైన సొత్తును సీజ్‌ చేశారు. మత్తికెరెకి చెందిన సయ్యద్‌ అమీన్‌ అహ్మద్‌ (48), గోవిందపురవాసి అమీర్‌ అహ్మద్‌ (48) పట్టుబడిన దొంగలు, వారి నుంచి 759 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిషనర్‌ సీమాంత్‌కుమార్‌ సింగ్‌ మంగళవారం తెలిపారు. శివాజీనగర స్టేషన్‌ రోడ్డులో మంత్రి ఇల్లు ఉంది, మంత్రి తల్లి అందులో ఉంటారు, ఏప్రిల్‌ 15న బీరువాలో ఉంచిన 1.2 కేజీల బంగారు నగలు పోయాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో నష్టం వచ్చిన పై దొంగలు ఇంట్లోకి చొరబడి నగలను ఎత్తుకెళ్లారని తేలింది.

బడా బైక్‌ దొంగల అరెస్టు

స్కూటర్లు, బైకులను చోరీ చేసి వాటికి నకిలీ ఆర్‌సి కార్డులను సృష్టించి అమ్ముతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను మంగళవారం బెంగళూరు హెబ్బగోడి పోలీసులు అరెస్ట్‌ చేసి రూ.41.67 లక్షలు విలువగల 51 వాహనాలను సీజ్‌ చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన చిత్తప్పగారి ఆనంద్‌ (39), నంద్యాలకు చెందిన షేక్‌ షఫీర్‌ బాషా (31)ను అరెస్ట్‌ చేశారు. 501 నకిలీ ఆర్‌సి కార్డులు కూడా లభించాయి. ఇటీవల బెంగళూరులో పలుచోట్ల బైక్‌లు చోరీ అయినట్లు ఫిర్యాదులు వచ్చాయి. హెబ్బగోడి పోలీసులు గత నెల 5న ఓ నిందితున్ని పట్టుకుని విచారించగా, గుట్టు రట్టయింది. హైదరాబాద్‌కు చెందిన ఓ ఏజెంట్‌ సాయంతో ఇంటర్నెట్‌ సెంటర్‌లో డూప్లికేట్‌ ఆర్‌సి కార్డులను రూపొందించినట్లు చెప్పారు. ఫేస్‌బుక్‌లో ప్రకటనలిచ్చి చోరీ వాహనాలను అసలుగా నమ్మించి అమ్మేసినట్లు ఒప్పుకున్నారు. వీరు బెంగళూరులో 9 పోలీసు స్టేషన్ల పరిధిలో బైక్‌ చోరీలకు పాల్పడ్డారు.

692 మొబైళ్ల రికవరీ

బెంగళూరు ఈశాన్య పరిధిలో చోరీలకు గురైన 692 మొబైల్‌ఫోన్లను రికవరీ చేసి సొంతదారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. వీటి విలువ రూ.1.75 కోట్లు అని చెప్పారు. ఈశాన్య విభాగంలోని 11 పోలీసు స్టేషన్ల పరిధిలో చోరీలకు గురైన మొబైల్‌లను సీఈఐఆర్‌ పరిజ్ఞానం ద్వారా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

ఇద్దరు దొంగల అరెస్టు

ఆభరణాల స్వాధీనం

Advertisement
 
Advertisement
Advertisement