రైతుల జీవనాడి.. సేవకు మళ్లీ రెడీ | - | Sakshi
Sakshi News home page

రైతుల జీవనాడి.. సేవకు మళ్లీ రెడీ

May 5 2026 7:08 AM | Updated on May 5 2026 7:08 AM

హొసపేటె: రైతుల జీవనాడిగా నిలిచిన, 70 ఏళ్ల చరిత్ర కలిగిన తుంగభద్ర డ్యాంలో మొత్తం 33 క్రస్ట్‌ గేట్ల ఏర్పాటు పనులు పూర్తి కావడంతో డ్యాం భద్రతపై రైతులు, అధికారుల్లో నెలకొన్న ఆందోళన తొలిగిపోయింది. ఈ డ్యాం రాబోయే మరో 50–60 ఏళ్ల పాటు సురక్షితంగా ఉంటుందని తుంగభద్ర బోర్డు అధికారులు అభిప్రాయపడుతున్నారు. 2024 ఆగస్టు 10వ తేదీ రాత్రికి రాత్రే తుంగభద్ర డ్యాంకు చెందిన 19వ క్రస్ట్‌గేటు గొలుసు తెగిపోయి కొట్టుకు పోయిన ఘటనతో డ్యాం భద్రతపై సర్వత్రా ఆందోళన రేకెత్తింది. డ్యాంలోని మొత్తం 33 పాత క్రస్ట్‌గేట్ల స్థానంలో కొత్త గేట్లను అమర్చేందుకు ప్రభుత్వం, నీటి పారుదల నిపుణులు, తుంగభద్ర బోర్డు అధికారులు అవిశ్రాంతంగా కృషి చేశారు. ప్రస్తుతం ఆ పనులు విజయవంతంగా పూర్తి కావడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

4–5 నెలల్లోనే పనులు పూర్తి

తుంగభద్ర డ్యాంకు చెందిన 19వ క్రస్ట్‌ గేటు కొట్టుకుపోయిన సమయంలో డ్యాంలో నీటి నిల్వ, వరద భారీగా ఉన్నాయి. దీంతో నీరంతా వృథాగా నదిలోకి పారుతోందని రైతులు ఆందోళన చెందారు. అయితే ఆ క్రస్ట్‌గేటును అమర్చేందుకు 2025 జూన్‌లో గుజరాత్‌కు చెందిన ఒక ప్రైవేట్‌ సంస్థతో ఒప్పందం కుదిరినప్పటికీ జూలై, ఆగస్టు నెలల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా పనులు చేపట్టడం సాధ్యం కాలేదు. అయితే డిసెంబర్‌ 5వ తేదీ నాటికి జలాశయంలో నీటిమట్టం 10 అడుగుల మేర తగ్గడంతో మొదట 18వ క్రస్ట్‌గేటు అమరిక పనులను ప్రారంభించారు. ఆ పనులు విజయవంతంగా పూర్తయిన తర్వాత 19వ క్రస్‌ గేటును మార్చాలని నిర్ణయించారు. ఈ రెండు గేట్లను అమర్చడానికి 2 నెలల సమయం పట్టింది. అనంతరం మిగిలిన క్రస్ట్‌ గేట్లను అమర్చే పనులు ముమ్మరంగా సాగాయి. డిసెంబర్‌ 25వ తేదీ నుంచి కేవలం 4–5 నెలల స్వల్ప వ్యవధిలోనే మొత్తం 33 క్రస్ట్‌గేట్ల ఏర్పాటు పనులు పూర్తి కావడం అందరి ప్రశంసలకు పాత్రమైంది.

రైతాంగంలో హర్షాతిరేకాలు

తుంగభద్ర డ్యాం నుంచి విజయనగర, బళ్లారి, కొప్పళ, రాయచూరు జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లోని లక్షలాది హెక్టార్ల భూమికి సాగునీరు అందుతోంది. అంతేకాకుండా పరిశ్రమలకు, తాగునీటి అవసరాలకు కీలకంగా ఉన్న ఈ డ్యాంకు చెందిన క్రస్ట్‌గేట్ల ఏర్పాటుకు 2–3 ఏళ్లు పట్టవచ్చనే భయంతో పాటు ప్రజల్లో అనేక రకాల ఆందోళనలు కూడా ఉండేవి. అయితే ఇప్పుడు కేవలం 4–5 నెలల స్వల్ప వ్యవధిలోనే అమర్చారు. నిపుణుడు కన్నయ్య నాయుడు నేతృత్వంలోని బృందంతో సహా పలువురు కార్మికులు ప్రాణాలకు తెగించి తొలుత తాత్కాలిక గేటును ఏర్పాటు చేశారు. రూ.52 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనుల్లో భాగంగా 33 క్రస్ట్‌గేట్ల ఏర్పాటుకు అవసరమైన ఇనుప పలకలను జోడించడం వంటి వివిధ సన్నాహక పనుల కోసం హొసపేటె, గదగ్‌ వద్ద రోజుకు 60 మంది కార్మికులు పని చేయగా, డ్యాం వద్ద మరో 60 మంది కార్మికులు నిత్యం శ్రమించారు. ఈ జలాశయానికి చెందిన ఒక్కో క్రస్ట్‌గేటు 60 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తు కలిగి, 5 టన్నుల బరువు ఉంది. నీటిని నిల్వ చేసే ఒక భారీ ఆనకట్టపై క్రస్ట్‌గేట్లను అమర్చే సాహసోపేతమైన ఈ పనిని హైడ్రాలిక్‌ క్రేన్లు, ట్రక్కుల వంటి ఆధునిక యంత్రాలను వినియోగించి ఎటువంటి ప్రమాదాలు లేకుండా పూర్తి చేసినందుకు తుంగభద్ర బోర్డు అధికారులు, ఇంజనీర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వెల్డింగ్‌, పెయింటింగ్‌ పనులు పెండింగ్‌

తుంగభద్ర డ్యాంకు చెందిన 33 క్రస్ట్‌గేట్ల ఏర్పాటు పనులు పూర్తయినప్పటికీ కొన్ని గేట్ల వెల్డింగ్‌, పెయింటింగ్‌ పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న ఈ పనులన్ని ఈనెల 15 నాటికి పూర్తి అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే జలాశయానికి చెందిన పాత క్రస్ట్‌గేట్లు 70 ఏళ్లకు పైగా మన్నిక వచ్చాయి. ఇప్పుడు కొత్త గేట్లను అమర్చిన నేపథ్యంలో వాటి నిర్వహణను సక్రమంగా చేపడితే రాబోయే మరో 50–60 ఏళ్ల పాటు ఎటువంటి సమస్యలు తలెత్తవని టీబీ బోర్డు అధికారులు పేర్కొంటున్నారు. తుంగభద్ర డ్యాంకు చెందిన 19వ క్రస్ట్‌గేటు కొట్టుకుపోవడంతో అప్పట్లో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ఏడాది రుతుపవనాలు ప్రారంభం కాకముందే మొత్తం 33 క్రస్ట్‌గేట్ల ఏర్పాటు పనులు పూర్తి కావడంతో తుంగభద్ర ఆయకట్టు రైతులు, ఆయా గ్రామాల ప్రజలు సంతోషంగా ఉన్నారు.

హొసపేటె సమీపంలోని తుంగభద్ర జలాశయం(ఫైల్‌)

డ్యాంకు ఇటీవల అమర్చిన కొత్త గేటు

70 ఏళ్ల నాటి పాత క్రస్ట్‌గేట్లన్ని

ఇప్పుడు కొత్తవే

మరో 60 ఏళ్ల వరకు డ్యాం

భద్రతకు ఢోకా లేదు

టీబీ డ్యాం 33 కొత్త క్రస్ట్‌గేట్ల

ఏర్పాటు పనులు పూర్తి

Advertisement
 
Advertisement
Advertisement